జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” విడుదలకు ముందు రోజు ఆ సినిమా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ పై ‘మా’కు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2 కోట్ల ఈ మ్యాటర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైన తర్వాత సెటిల్ చేస్తానని నిర్మాత పవన్ తో చెప్పినట్లుగా సమాచారం హల్చల్ చేసింది. అయితే, సినిమా విడుదలై దాదాపు 10 రోజులు ముగుస్తోంది. ఆశించిన స్థాయిలోనే దాదాపుగా 40 కోట్లు పైనే ఇప్పటివరకు కొల్లగొట్టింది. మరి పవన్ కు ఇవ్వాల్సిన మొత్తాన్ని నిర్మాత ప్రసాద్ తీర్చేసారా? అన్నది అభిమాన వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి లభించిన సమాచారం మేరకు నిర్మాత ప్రసాద్ వ్యక్తిగతంగా పవన్ కు ఫోన్ చేసి మాట్లాడినట్టు టాక్. మరి బాకీ రద్దయ్యిందో లేదో తెలియదు.
సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో బిజెపి తరపున ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారా? లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గానే మారింది. అయితే దీనిపై కిషన్ రెడ్డి తాజాగా ఓ ప్రకటన జారీ చేసారు. “జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి పిలవలేదని” స్పష్టం చేసారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం విషయంలో క్లారిటీ వచ్చేసినట్లే. ప్రస్తుతం “సర్ధార్ గబ్బర్ సింగ్”ను పూర్తి చేయడమే పవన్ లక్ష్యంగా కనపడుతోంది.





