
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల గురించి ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల డెప్యూటీ కమీషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్, హిర్దేశ్ కుమార్ బృందం ఈరోజు రాష్ట్రానికి వస్తోంది. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితాలు తదితర అంశాలపై చర్చించి తగు ఆదేశాలు జారీ చేయనున్నారు.
శనివారం రాష్ట్ర సిఎస్, డిజిపి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులలతో సమావేశమయ్యి ఎన్నికల నిర్వహణ అధికారుల నియామకం, శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు.
మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలు 20 రోజులు ముందుగా జరుగుతాయని చెప్పేశారు. అందుకే వైసీపి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలని చకచకా అటూ ఇటూ మార్చేస్తున్నారు. అందుకే జనవరి నుచి వాలంటీర్లకు జీతాలు, పించన్‌దారులకు పించన్లు కూడా పెంచేస్తున్నారని భావించవచ్చు.
టిడిపి, జనసేనలకు కూడా ఈ విషయం తెలుసు కనుకనే సంక్రాంతిలోగా సీట్ల సర్దుబాట్లు చేసేసుకొంటామని చెపుతున్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాస్త ముందుగా ముగించడం కూడా ఎన్నికల ఏర్పాట్ల కోసమే అని అర్దమవుతోంది. కనుక మూడు ప్రధాన పార్టీలలొ ఎన్నికల హడావుడి మొదలైన్నట్లే భావించవచ్చు.
కానీ ఏపీ బీజేపీ మాత్రం చాలా నిర్లిప్తంగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా హుషారుగానే పని మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం ఏపీ బీజేపీపై కూడా బాగా పడిన్నట్లే ఉంది.
ఆయన అరెస్టుపై మోడీ, అమిత్ షాలు స్పందించకపోవడం, బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తుపెట్టుకొంటున్నట్లు ప్రకటించడంతో దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీలో బీజేపీ ఏవిదంగా ముందుకు సాగాలో తెలీని పరిస్థితి ఎదురైంది. అయితే త్వరలో ఎన్నికల గంట మ్రోగబోతోందని మోడీ, అమిత్ షాలకే ముందు తెలుస్తుంది కనుక బహుశః త్వరలోనే పురందేశ్వరికి దిశానిర్దేశం చేయవచ్చు.
గత ఎన్నికలకు 2019, మార్చి 10వ తేదీన షెడ్యూల్ విడుదల కాగా ఈసారి ఫిబ్రవరి 15-20 తేదీల మద్య ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…