మీడియా మిత్రులతో తన అభిప్రాయాలు పంచుకునే తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వర్తమాన రాజకీయాలపై మరియు ఇద్దరి ముఖ్యమంత్రుల పని తీరుపై ‘జనసేన’ అధినేత, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు పక్కదారి పట్టడం శోచనీయం. తెలంగాణా రాష్ట్రంలో పాలిస్తున్న కేసీఆర్ పాలన బాగుందని తనకు చెప్తున్నారని, ప్రత్యక్షంగా తానూ చూడనప్పటికీ, అందరూ బాగుందని అంటున్నారని, అయితే ఒక ఉద్యమ పార్టీగా పుట్టిన కేసీఆర్, ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తీసుకోవడం మాత్రం తనకు నచ్చని అంశమని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా తీరుపై స్పందించిన పవన్ కళ్యాణ్… “చంద్రబాబు పాలన తానూ భిన్న స్పందనలు విన్తున్నానని, కానీ మీడియా ప్రముఖుల వంటి వివిధ వర్గాల నుండి తనకు లభిస్తున్న సమాచారం మేరకు ఏపీని అభివృద్ధి చేయాలని చంద్రబాబు చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయన చిత్తశుద్ధిలో ఎలాంటి లోపం లేదు, కాకపోతే ఆయనకు సహకారం అందించాల్సిన సపోర్టింగ్ సిస్టమ్స్ సరిగా లేవని తానూ భావిస్తున్నట్లుగా” చెప్పారు. అయితే ఇక్కడ కూడా వైసీపీ నుండి ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి తీసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు.
కేసీఆర్, చంద్రబాబులపై పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచిన స్పష్టమైన అభిప్రాయాలు సోషల్ మరియు వెబ్ మీడియా వేదికగా పక్క దారిని పట్టించడం విస్తుగొలిపే అంశం. ‘కేసీఆర్ పాలన బాగుందని పవన్ పొగిడారు, అదే చంద్రబాబు విషయంలో భిన్న స్పందనలు ఉన్నాయంటూ పవన్ చెప్పారని’ చంద్రబాబు వ్యతిరేక వర్గం పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపింది. అయితే వాస్తవ రూపానికి వస్తే చంద్రబాబుపైన గానీ, ఆయన పాలనపై గానీ వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం గమనించదగ్గ అంశం. అంతేగాక, కేంద్రం నుండి ఆశించిన సహకారం అందక చంద్రబాబు ఇబ్బంది పడుతున్న వైనాన్ని పవన్ ఎత్తి చూపారు.
అయితే ఒకవేళ సదరు ఔత్సాహికులు వ్యక్తపరిచినట్లు పవన్ విమర్శించాడని భావించాల్సి వచ్చినా… మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంతో లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ఏ విధంగా పోలుస్తారో సదరు “మేధావి” వర్గమే బదులివ్వాలి అన్న కామెంట్లు వినపడుతున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ వ్యాఖ్యలలో గమనించాల్సిన విషయం ఏమిటంటే… తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పకుండా… ‘ఇతర వర్గాల నుండి తనకు లభిస్తున్న సమాచారం మేరకు’ అని స్పష్టంగా చెప్పారు. అయితే పవన్ చేసిన కామెంట్ ను తమకు అనుకూలంగా మలుచుకుని చంద్రబాబు వ్యతిరేక వర్గాలు దుష్ప్రచారానికి తెరలేపాయి. బహుశా ఈ విషయంలో వీరిద్దరి మధ్య విబేధాలు సృష్టించి, పవన్ ను తమ నాయకుని వైపుకు తిప్పుకునే ప్రయత్నాన్ని సాగిస్తున్నాయోమోనని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.



