పవన్, తారక్, జక్కన్న, బన్నీలతో… ఆడుకుంటున్నారుగా..!

Allu-Arjun-Past-Life!సినీ సెలబ్రిటీలపై సామాన్య ప్రేక్షకులకు సహజంగా ఉండే క్రేజు, మోజు తెలియనిది కాదు. తమ అభిమాన హీరోలకు, హీరోయిన్లకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా అత్యంత ఆసక్తికరంగా తెలుసుకోవడం ఫ్యాన్స్ కు పరిపాటి. మరి అలాంటి హీరోల గత జన్మ విశేషాలు తెలిస్తే… ఏంటి కాన్సెప్ట్ కొత్తగా ఉందని అనుకుంటున్నారా..! అవును… నిజమే..! ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్ లతోనే నేటి ఔత్సాహికులు వీడియోలను రూపొందిస్తూ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇటీవలే ప్రారంభమైన ఈ తరహా పబ్లిసిటీలో ఇప్పటికే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకధీరుడు రాజమౌళి వంటి టాప్ సెలబ్రిటీల గత జన్మ విశేషాలను చెప్పేశారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ గా వెలుగొందుతున్న బన్నీ, గత జన్మలో అపర భగీరధుడు అంట! వింటున్నారా..! అభిమానులను ఉత్సాహ పరిచేందుకు సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ ఉంటే బాగా పేల్తాయి గనుక, సరిగ్గా ఇలాంటి హీరోయిజం క్యారెక్టర్లనే మన హీరోలకు ఆపాదిస్తూ అతిశయోక్తులతో ఆకాశానికెత్తెస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గత జన్మలో ఒక రారాజు అంట… జూనియర్ ఎన్టీఆర్ ఒక యోధుడు అంట… బన్నీ భగీరధుడు… రాజమౌళి ఒక బ్యాచిలర్… ఇలా మాంచి రసవత్తరమైన కధలను ఎంచుకుని ఒక్కో సెలబ్రిటీకి వాటిని జోడిస్తున్నారు. ఇక భవిష్యత్తులో మహేష్ ను పరమశివుడు, రామ్ చరణ్ ను రాముడు అన్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రొటీన్ యూ ట్యూబ్ వీడియోల మాదిరి కాకుండా, కాస్త ఫాంటసీ సబ్జెక్ట్ తో కూడుకున్నది గనుక… ఒక్కసారి పబ్లిసిటీ పీక్స్ లో చేస్తే యూ ట్యూబ్ క్లిక్స్ వచ్చిపడతాయనేది అసలు ఉద్దేశం.

మరో విశేషం ఏమిటంటే… ప్రస్తుతం హీరోలుగా అశేష ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న వీరందరికీ, గత జన్మలో కూడా హీరోయిజంతో నిండి ఉన్న క్యారెక్టర్లే ఇవ్వడం. యూ ట్యూబ్ క్లిక్స్ కోసం టాప్ హీరోల పేర్లతో అభిమానులను ఆడుకునే ప్రక్రియగా కనపడుతుందే తప్ప, ఏ ప్రాతిపదకన వీరందరి గత జన్మ విశేషాలను చెప్తున్నారో క్లారిటీ లేదు. ప్రస్తుత జన్మలో పుట్టిన సమయాలను బట్టి గత జన్మ విశేషాలు ఇంత తేలికగా, అవలీలగా చెప్తున్న ఆ వ్యక్తిలో ఎన్ని మహిమలు ఉన్నాయో… ఇంకెన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయో మరి..! హిందుత్వంలో పూర్వజన్మ సిద్ధాంతం ఉంది గనుక, యూ ట్యూబ్ ద్వారా దానిని ‘క్యాష్’ చేసుకునే ప్రక్రియే ఇదంతా!

ADVERTISEMENT
Latest Stories