జనసేన అధినేతపై జగన్ చేసిన వ్యక్తిగతమైన దూషణలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో పవన్ నుండి ఎలాంటి స్పందన వస్తుందోనని అంతా ఎదురుచూసారు. కానీ యధావిధిగా అభిమానులతో సహా అందరినీ చప్పపరుస్తూ ఓ సాధారణమైన కామెంట్స్ చేసారు పవన్.
[m9ad]
‘తాను బలమైన వ్యక్తిని కనుకనే తనపై జగన్ విమర్శలు చేసారని, మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను కాబట్టే ప్రత్యర్ధి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని, రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన జగన్ కే అంతుంటే, నిజాయితీపరుడినైన తనకు ఇంకెంత ఉండాలని’ రొటీన్ సినీ డైలాగ్ లా మాదిరి పొలిటికల్ స్పీచ్ ను ఇచ్చారు.
ఈ మాటల వలన పొలిటికల్ గా పవన్ కు ప్రత్యేకంగా చేకూరే మైలైజ్ ఏదీ ఉండదు. అంతేకాక అందివచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. అవును… వ్యక్తిగత విమర్శల రూపంలో జనసేనకు ఒక మంచి గుర్తింపు తీసుకువచ్చే అవకాశాన్ని జగన్ చేజేతులా అందించారని చెప్పాలి. కానీ దానిని ఒడిసి పట్టుకోవడంలో మరోసారి తన వైఫల్యతను జనసేన అధినేత చాటుకున్నారు.
అలా కాకుండా… “జగన్ నుండి ఇలాంటి చవకబారు విమర్శలు ముందే ఊహించినవని, ఇవాళ కాకపోతే రేపైనా జగన్ అనే వారని, వారికి వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప, రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగపడే విధంగా నాలుగు మాటలు కూడా మాట్లాడలేరని, ఏం చేయాలన్నా ముందు సిఎం పోస్ట్ కావాలంటారని” మండిపడవచ్చు. అంతకంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే…
జనసేనను నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న కుట్రగా దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. గతంలో ‘ప్రజారాజ్యం’ విషయంలో కాంగ్రెస్ – టిడిపిలు కలిసి అదే చేసాయని, ఇప్పుడు వైసీపీ – టిడిపిలు కలిసి అదే చేస్తున్నాయని, అందుకే ఈ రెండు పార్టీలు తనపై విమర్శలు చేస్తున్నాయని, అసలు తాను అన్న దాంట్లో తప్పేంటో చెప్పాలని” విమర్శలు చేస్తూనే టిడిపితో పాటు జగన్ కు చెక్ పెట్టె విధంగా డిమాండ్ చేయవచ్చు.
ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… వైసీపీ – జనసేనలు రహస్య అజెండాతో బిజెపితో పనిచేస్తున్నాయని టిడిపి ఆరోపణలు చేస్తుండగా, టిడిపి – జనసెనలు కలిసి తెరవెనుక బిజెపితో మంతనాలు జరుపుతున్నాయని వైసీపీ విమర్శిస్తుండగా, టిడిపి – వైసీపీలు కుట్ర కోణంలో జనసేనను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే అవకాశాన్ని పవన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు.
తన వివాహ జీవితం ఎలాగూ బహిరంగమే కాబట్టి, గతంలో చెప్పిన విధంగానే అది ‘ఓపెన్ సీక్రెట్’ అని ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవచ్చు. దాని వలన ప్రత్యేకంగా పవన్ కు వచ్చే నష్టమేమీ లేదు. రాజకీయాలలో అనుకూల సమయం అన్ని సార్లు రాదు, వచ్చినపుడు ఒడిసి పట్టుకోవడమే నాయకుడి లక్షణం, అది పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం అబ్బలేదని ఈ సందర్భంగా మరోసారి నిరూపణ అవుతోంది.



