తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు బలమైన కారణమని నమ్ముతారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకుంటారట. ఈ విషయంలో సాక్ష్యాత్తు రాష్ట్ర పంచాయతీ రాజ్, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం విశేషం.
మా నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని 16 నెలలు జైలులో పెడితే, చంద్రబాబును 16 ఏళ్లు జైల్లో పెడతాం. గతంలో ఆయన చేసిన అవినీతిని వెలికితీస్తున్నాం’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అవినీతి, రౌడీయిజాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివాళ్లపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ తానులో ముక్కేనని, అందుకే చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన మూడుసార్లూ వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే విస్తారంగా వర్షాలు పడ్డాయన్నారు.
ఇసుక శాఖకు మంత్రైన పెద్దిరెడ్డి ఇసుక కొరతను తక్కువ చేసి మాట్లాడటం విశేషం. వరదలు ఉధృతంగా ఉండడం వలనే తాత్కాలికంగా ఇసుక కొరత ఏర్పడిందని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు పనికట్టుకుని నానా యాగీ చేస్తున్నంతగా ఇసుక కొరత లేదన్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా ఇసుక సమస్యతోనే చనిపోయారని టీడీపీ వాళ్లు కట్టుకథలు అల్లుతున్నారని వ్యాఖ్యానించారు. అయినా అలాంటి వారికి కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.



