నెమ్మదిగా రాష్ట్ర బీజేపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వరం పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై విమర్శలు చేస్తుండగా తాజాగా ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా చేరారు. జగన్ పనితీరు చూస్తుంటే.. ఆయనకు సరైన సలహాదారులు లేరనిపిస్తోందన్నారు. ప్రజావేదికను ఒకరోజులో కూల్చిన ప్రభుత్వం.. 70 రోజులు గడుస్తున్నా ఇసుక విధానంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.
ఇసుక లేకపోవడంతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 70 రోజుల్లో ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు చెప్పాలంటే ఒకరోజులోనే సమయం దొరికేదని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బెటర్ అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది.
గతంలో ఒక వర్గం బీజేపీ నేతలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిరోజు విమర్శలు చేసే వారు. చంద్రబాబు నాయుడు ఓటమిలో వారు అంతా తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చి కనీసం 100 రోజులు కూడా కాకముందే వారు విమర్శలకు పని చెప్పడం విశేషం. దేశం మొత్తం మీద బీజేపీ పెద్ద రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే తన ఖాతాను తెరవ లేకపోయింది. దీనితో వారు ఈ రాష్ట్రాన్ని వారు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది.





