మహాభారతాన్ని, హిందూ మతాన్ని ప్రముఖ హీరో కమల్ హాసన్ అవమానించారని ఆరోపిస్తూ… తమిళ సంస్థ హిందూ మక్కల్ కచ్చి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు వివరణ ఇవ్వాలని కమల్ కు నోటీసులు పంపింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… పాంచాలిని జూదంలో పావులా వాడుకున్న మహాభారతాన్ని ఎందుకు గౌరవించాలని కమల్ ప్రశ్నించారు.
అలాగే ఓ మహిళను అవమానానికి గురి చేసిన గ్రంధం మహాకావ్యం ఎలా అవుతుందని కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు హిందూ సంఘాలు విమర్శలు గుప్పించాయి. హిందూమతంపై చేసిన ఇటువంటి వ్యాఖ్యలను చేసిన కమల్, మరో మతంపై చేసే దమ్ము, ధైర్యం ఉందా? అని హెచ్ఎంకే కార్యదర్శి రవికుమార్ ప్రశ్నించారు. కమల్ కు వ్యతిరేకంగా తమిళనాట పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
అయినా ఒక నటుడిగా కమల్ తన పాత్ర తానూ పోషించుకోక, రాజకీయాలు, కుల, మతాల గురించి ఎందుకు ప్రస్తావించడం? అలా మాట్లాడి ఎందుకు కొత్తగా తలనొప్పులు తెచ్చుకోవడం? అంటూ అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా జయలలిత ‘కాలం’ చేసిన తర్వాత, రాజకీయ పరమైన అంశాలలో కమల్ జోరు చాలా స్పీడ్ గా ఉంది. కమల్ కంటే భారీ ఫాలోయింగ్, స్టార్ స్టేటస్ కలిగిన రజనీకాంతే సైలెంట్ గా ఉంటే, కమల్ కు ఈ తొందరపాటు చర్యలెందుకు అన్న టాక్ ప్రధానంగా వినపడుతోంది.


