మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక సినిమా, సైరా పై ఉయ్యాలవాడ వంశీకుల పోరాటం కొనసాగుతుంది. మొన్న ఆ మధ్య కొంత మంది రామ్ చరణ్ ఆఫీస్ ముందు నిరసన తెలిపినందుకు కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. తాజాగా వారు సాయంత్రం జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను అడ్డుకుంటాం అని హెచ్చరిస్తున్నారు.
సినిమా మొదట్లో నిర్మాత రామ్ చరణ్ ఉయ్యాలవాడ వారసులమైన తమ వద్ద నుండి కథను, అనేక ఇతర వివరాలను తీసుకుని 23 మంది కుటుంబ సభ్యులకు 52 కోట్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత అగ్రిమెంట్ కూడా ఇచ్చారని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ నందు చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ మీద పిర్యాదు చేశారు. మరి ఈ వివాదాన్ని చరణ్ అండ్ టీమ్ ఎలా ముగిస్తారో చూడాలి.
ఇప్పటికే వారికి ఏమీ ఇచ్చే ఉద్దేశం లేదన్నట్టు చరణ్ మీడియా ముందు చెప్పారు. 100 ఏళ్ళ తరువాత కథ అంటే అది చరిత్ర అవుతుందని గతంలో సుప్రీమ్ కోర్టు చెప్పిందని ఆయన చెప్పడం కొసమెరుపు. అంతే కాకుండా ఉయ్యాలవాడ కోసం ఏదైనా చెయ్యాలంటే ఆయన పుట్టిన ఊరికి చెయ్యాలి గానీ సొంత కుటుంబ వారికి చేస్తే అది ఆయనను కించపరచినట్టే అని చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఐదు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీస్థాయి అంచనలున్నాయి. ప్రతీ భాషలో అత్యధిక థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే చిరంజీవి దేశవ్యాప్తంగా తిరిగి సినిమాను ప్రమోట్ చేస్తారని సమాచారం. దీనికోసం విస్తృత ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం.





