
ఏపీలో రాజకీయపార్టీలు వైసీపికి నచ్చిన్నట్లు మసులుకోవాలని లేకుంటే దేశద్రోహం కంటే తీవ్రమైన నేరంగానే పరిగణించాలని వైసీపి కోరుకొంటుంది.
టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకూడదు. పెట్టుకొంటే అపవిత్రం. తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడం తప్పు. చేస్తే మరో తప్పు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడం తప్పు… అంటూ వైసీపి తమ అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతుంటుంది. కానీ వాటిని ప్రతిపక్షాలు పట్టించుకోకుండా తమకు నచ్చిన్నట్లే వ్యవహరిస్తూ వైసీపిని నొప్పిస్తుంటాయి. అది వేరే విషయం.
ఓ రాజకీయ పార్టీకి మరో పార్టీపై ఎటువంటి అభిప్రాయాలున్నా అది వాటిష్టం. కానీ ఈడీ, సీబీఐ, న్యాయస్థానాలు తదితర రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా వైసీపికి అనుకూలంగా మసులుకోవాలని, లేకుంటే వాటినీ విమర్శించడానికి వైసీపి వెనకాడదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
వివేకా హత్య కేసులో సీబీఐని, కోడికత్తి కేసులో ఎన్ఐఏని, ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ హైకోర్టుని వైసీపి తప్పు పడుతుండటమే ఇందుకు నిదర్శనం.
ఏపీ హైకోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తప్పు పట్టారు. ఏపీ హైకోర్టు తీర్పు చట్టబద్దం, న్యాయబద్దం కాదని తేల్చి చెప్పేశారు.
బెయిల్ పిటిషన్ కేసు విచారణలోనే సాక్ష్యాలు, ఆధారాలు అన్నిటినీ పరిగణనలో తీసుకోకూడదని అన్నారు. ఒకవేళ సాక్ష్యాధారాలు లేవనుకొంటే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చునన్నారు. ఈ కేసులో 17-ఏ పిటిషన్, చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ రెండూ కూడా సుప్రీంకోర్టు విచారిస్తున్నప్పుడు, ఏపీ హైకోర్టు ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడుకి క్లీన్ చిట్ ఇచ్చేసిన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసి, హడావుడిగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేసిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
ఈ కేసుకు సంబందించిన సాక్ష్యాధారాలను ఈ కేసుని విచారిస్తున్న ట్రయల్ కోర్టు(ఏసీబీ కోర్టు)కి మాత్రమే సమర్పిస్తామని, ఏపీ హైకోర్టుకి సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు నాయుడు కోసం ఏపీ హైకోర్టు కొత్త చట్టాలు, నియమ నినబంధనలు ఏమైనా పెట్టుకొందేమో?అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ హోదాలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసు గురించి మాట్లాడాల్సివస్తే న్యాయపరమైన అంశాల గురించి న్యాయపరమైన కోణంలోనే మాట్లాడవలసి ఉంటుంది. కానీ ఆయన వైసీపి అధినేత మనసులో ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది.
ఏపీ హైకోర్టు తీర్పు న్యాయసమ్మతం, చట్టసమ్మతం కాదని చెప్పడమంటే హైకోర్టు తీర్పులు వైసీపికి అనుకూలంగా ఉంటే ఓకే లేకుంటే సమ్మతం కాదని చెపుతున్నట్లుగా ఉంది.
అంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలే కాదు న్యాయవ్యవస్థలు కూడా వైసీపికు అనుకూలంగా నడుచుకోవాలని ఆశిస్తున్నారా?
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…