ప్రభాస్ పెళ్లి ప్రియురాలు తప్ప ఇంకేం లేవా

Prabhas unstoppableగత వారం స్ట్రీమింగ్ మొదలుపెట్టిన కొన్ని సెకండ్లకే ఆహా యాప్ క్రాష్ అయిపోవడం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. బాలయ్య ప్రభాస్ ల తొలి సుదీర్ఘ కలయికకు వేదికగా మారిన అన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ మాములుగా ఎదురు చూడలేదు. లక్షల్లో సబ్స్క్రిప్షన్లు కేవలం ఈ ప్రోగ్రాం కోసమే తీసుకున్న వాళ్ళున్నారు. దీని క్రేజ్ చూసే ఆహా యాజమాన్యం పైరసీని కట్టడి చేయడానికి ఏకంగా కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. ఒక ఓటిటి షో కోసం ఇలా చేయడం ఇదే మొదటిసారి. కట్టడి చేశారా లేదా అనేది తర్వాతి సంగతి కానీ కనీసం ప్రయత్నం చేయడం అభినందనీయం.

ఇదంతా బాగానే ఉంది కానీ ఆడియన్స్ లో దీని మీద ఉన్న ఆసక్తిని గుర్తించిన ఆహా ప్రభాస్ ట్రాక్ ని రెండు భాగాలుగా కట్ చేయడమే కొంచెం ప్రతికూలంగా మారింది. ఎందుకంటే గత వారం ఉన్న బజ్ ఈ వీక్ కనిపించలేదు. ఫ్యాన్స్ సైతం ట్విట్టర్ లో ఏమంత హడావిడి చేయలేదు. కారణం ఇప్పుడీ సెకండ్ పార్ట్ లో ఎగ్జైటింగ్ గా అనిపించే అంశాలు పెద్దగా లేకపోవడమే. ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ లేదా నిజ జీవిత భాగస్వామి ఎవరు అనే పాయింట్ మీద సాధారణ జనంలో ఆసక్తి ఉన్న మాట నిజమే. అలా అని ఏదో కాబోయే భారతదేశ ప్రధాని ఎవరు అని గంటల తరబడి దాని గురించే ఆలోచించే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో అయితే లేరు.

ADVERTISEMENT

అలాంటప్పుడు పదే పదే కృతి సనన్ టాపిక్ తీసుకురావడం, తనతో పాటు అనుష్క ఫోటోలను చూపించి రిపీట్ చేసినట్టు అవే ప్రశ్నలు అడగటంలో ఉద్దేశం అర్థం కాలేదు. ఫస్ట్ పార్ట్ లోనూ ఉంది ఇప్పుడీ రెండో భాగంలోనూ అదే ఉంది. సోషల్ మీడియా మీమ్స్ కి ఎడిటింగ్ కి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాని మీద నిమిషాల తరబడి చర్చలు ఇదంతా సమయాన్ని తినేసే వ్యవహారమే. ఈ ల్యాగ్ ని బాలయ్య మీద తోసేయలేం. స్క్రిప్ట్ బాధ్యతలు నిర్వహణ చూస్తున్న బివిఎస్ రవి రచనలో ఇదంతా సాగుతుంది. మరి ఇంతకన్నా టాపిక్సే పెట్టడానికి ఛాన్స్ లేదా అంటే లేకేం బోలెడుంది.

ఎలాగూ గోపీచంద్ వచ్చాడు. అతనికి తండ్రి తాలూకు సంగతులు పెద్డగా గుర్తులేకపోయినా బాలయ్యతో టి కృష్ణ జ్ఞాపకాలు ఆయన సినిమాల గురించి కాసిన్ని ముచ్చట్లు చెప్పించి ఉండొచ్చు. ప్రభాస్ తో స్నేహం ఎప్పుడు మొదలయ్యింది ఇంతగా ఎలా క్లోజ్ అయ్యారు లాంటి ఫ్లాష్ బ్యాక్ లు తవ్వించి ఉండొచ్చు. ఎంత పెదనాన్న వారసత్వంతో వచ్చినా డార్లింగ్ కెరీర్ లో ఎదురుకున్న ఆటుపోట్లు ఎన్నో ఉంటాయి. వాటిని బయటికి తీసి ఆసక్తి కలిగించి ఉండవచ్చు. అసలు ప్రభాస్ కుటుంబం గురించి ఎన్నో విశేషాలు ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. ఇవన్నీ వదిలేసి ఎవరు ఆమె ఎవరు ఆమె అంటూ సీరియల్ టైపు సాగతీతకి వెళ్లిపోవడంతో అన్ స్టాపబుల్ అంచనాలు ఈసారి సగం దూరమే అందుకున్నాయి. పవన్ ఎపిసోడ్ లో ఇలాంటివి రిపీట్ కాకూడదనే ఫ్యాన్స్ ఆకాంక్ష.

ADVERTISEMENT
Latest Stories