యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ స్టామినాకు నిదర్శనంగా నిలిచిన “మిర్చి” సినిమా మూడు సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ‘డార్లింగ్’ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కు గుర్తింపు తేవడంతో… “మిర్చి” అనే సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ మైలురాయిగా అభిమానులు అభివర్ణిస్తూ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.
అయితే ఇదే సమయంలో “నాన్నకు ప్రేమతో” సినిమా ఇచ్చిన నూతన ఉత్సాహంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు “జనతా గ్యారేజ్” పట్ల ఆందోళన చెందుతున్నారు. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా కధకు సంబంధించి ఇటీవల చక్కర్లు కొడుతున్న అంశమే తారక్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. “మిర్చి, శ్రీమంతుడు” వంటి సూపర్ హిట్ల తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “జనతా గ్యారేజ్” సినిమా కధ “మిర్చి” సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.
దీంతో టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు దక్కిన ఆదరణ దృష్ట్యా తారక్ ఫ్యాన్స్ ‘మిర్చి’ తరహా సినిమా వార్తలపై కాస్త కంగారు పడుతున్నారు. అయితే ఇవేమీ అధికారికంగా వెల్లడైన వార్తలు కాదు, పెద్ద హీరోల సినిమాలపై ఇలాంటి రూమర్లు సర్వసాధారణమే… వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘టెంపర్, నాన్నకు ప్రేమతో’ వంటి విలక్షణ సినిమాల తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో… ‘జనతా గ్యారేజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగష్టు 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





