పాకిస్తాన్ కు కౌంటర్ వేసిన రాష్ట్రపతి ప్రణబ్!

president pranabh mukherjee warns pakisthanభారత 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించిన ప్రణబ్, ఉగ్రవాద ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు దేశాలన్నీ కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక దాయాది దేశం పాకిస్థాన్ తో చర్చల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రణబ్… చర్చలను నిలుపుదల చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. “బుల్లెట్ల వర్షం కింద శాంతి చర్చలు నిర్వహణ సాధ్యం కాదని” పరోక్షంగా పాకిస్తాన్ అవలంభిస్తున్న విధానాలను ఏకరువు పెట్టారు. జీడీపీలో 7.3 వృద్ధి అంచనాతో భారత్ భవిష్యత్తులో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కూడా ప్రణబ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీ భద్రతా బలగాల చక్రబంధం నడుమ భారత గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పారా మిలిటరీ బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా భారీ సంఖ్యలో మోహరించారు. మొత్తం 80 వేల మంది పోలీసులు నగరంలో భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు.

భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జరగనున్న పరేడ్ లో ఫ్రాన్స్ సైన్యం కూడా పాలుపంచుకుంటోంది. ఢిల్లీలోని రాజ్ పథ్ లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న వేడుకలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. సుశిక్షితులైన సైనికులతో పాటు డ్రోన్ కెమెరాలు కూడా వేడుకలపై నిఘా పెట్టాయి.

ADVERTISEMENT
Latest Stories