ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తోన్న ఆఫర్లు మరే ముఖ్యమంత్రికి కూడా రాకపోవచ్చు. అది కూడా ప్రత్యర్థి వర్గాలు రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్తూ ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అయితే వీటిని స్వీకరించే దశలో ముఖ్యమంత్రి వర్యులు ఉన్నట్లు లేరు.
“మా ముఖ్యమంత్రి స్పష్టమైన తెలుగులో ‘అనర్హత’ అని ఓ 10 సార్లు పలికితే చాలు, అదే శిరోధార్యంగా భావించి తాను వైసీపీకి రాజీనామా చేసేస్తానని, అయితే స్పష్టంగా ‘అనర్హత’ అని మాత్రమే అనాలని, అననర్హత అని ఏదొక విధంగా అంటే కుదరదని ఇటీవల రఘురామకృష్ణంరాజు ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇలాంటి ఆఫర్ నే 2017లో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా ప్రకటించారు. రిపబ్లిక్ డేకు, ఇండిపెండెన్స్ డే కు తేడా తెలియకుండా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో జగన్ అన్న ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, జగన్ జాతీయ గీతం పాడితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు.
విశేషం ఏమిటంటే… ఈ ఇద్దరు పార్టీ నేతలు కూడా వైసీపీ నుండి బయటకు వచ్చినవారే. ఆర్ఆర్ఆర్ ఇంకా గానీ, నేడో రేపో అన్న తరుణంలో ఈ నెల 11వ తేదీకి ముహుర్తాన్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. బహుశా జగన్ ను దగ్గరగా చూడడం వలన జగన్ ఎలా మాట్లాడగలుగుతారు అని తెలియడం వలనో ఏమో గానీ, జగన్ తెలుగు పాండిత్యాన్ని సవాల్ విసురుతున్నట్లయ్యింది.
ఇలాగే భవిష్యత్తులో మరికొంత మంది వైసీపీ నేతలు గనుక బయటకు వచ్చి సవాల్ విసిరితే, అది జగన్ పలికే తెలుగు భాషను ఛాలెంజ్ చేస్తున్నట్లే. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ లో తెలుగులో పాఠ్యాంశాలను బోధించడం పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే.
—



