
సోషల్ మీడియాలో ప్రధాని మోడీ కంటే రాహుల్ గాంధీకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఆయన ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతున్నారా?
దేశానికి దిశానిర్దేశం చేసి అభివృద్ధిపధంలో నడిపించగలరనే నమ్మకం ప్రజలలో కల్పించగలుగుతున్నారా?అసలు ఆయన కార్యక్రమాలతో, ప్రసంగాలతో కనీసం అటువంటి బలమైన సంకేతాలు ఇవ్వగలుగుతున్నారా? అంటే కాదనే అందరికీ తెలుసు.
ఎంతసేపు ప్రధాని మోడీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తుండటం, ఎన్నికలలో ప్రజలను ఆకర్షించడానికి ఏవో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేదు.
ప్రధాని మోడీ, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సిఎంలు కేసీఆర్, జగన్, మాజీ మంత్రి కేటీఆర్ వంటివారు నాయకత్వ లక్షణాలు కలిగిన నేతలు. ఇటువంటి నాయకత్వ లక్షణాలు రాహుల్ గాంధీలో ఉన్నాయా?అంటే లేవని అందరికీ తెలుసు.
కానీ యావత్ దేశంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు కదా?రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆయనకు ‘జీ హుజూర్’ అంటున్నారు కదా?అంటే వారు ఆయన రాజకీయ వారసత్వాన్నే గౌరవిస్తున్నారు తప్ప ఆయనలో నాయకత్వ లక్షణాలున్నాయని కాదు.
త్వరలో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక బీహార్ వెనుకబాటుతనం, పేదరికం, అభివృద్ధి, ఐటి కంపెనీలు, పరిశ్రమలు, ఉద్యోగాలు మౌలిక వసతుల కల్పన వంటి అంశాల గురించి మాట్లాడుతూ ప్రజలను మెప్పించాల్సిన రాహుల్ గాంధీ, ‘ఓట్ల చోరీ’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈసీని నిందిస్తూ ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటున్నారు.
ఈ మాటలు బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకునేందుకు తోడ్పడవచ్చు గాక. కానీ ప్రధాని మోడీలా రాహుల్ గాంధీ దేశాన్ని నడిపించగలరనే నమ్మకం మాత్రం కల్పించలేరు.
కనుక ప్రధాని మోడీకి తానే ప్రత్యామ్నాయం అని రాహుల్ గాంధీ నిరూపించుకోవాలంటే ముందుగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం చాలా అవసరం. లేకుంటే ఎప్పటికీ ఇలాగే రాజకీయ కాలక్షేపం చేసుకోవాల్సిందే!
Aamir Khan has finalized his upcoming film schedule by locking in two major projects. The…
నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపి శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘనంగా…