
నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపి శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులు అర్పించాయి. నందమూరి కుటుంబ సభ్యులు, జూ.ఎన్టీఆర్, నారా భువనేశ్వరి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో నేడు మహానాడు రెండో రోజు కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపి మహిళా నాయకురాలు టి.జ్యోత్స్న మాట్లాడుతూ, “సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ వంటి డైనమిక్ నాయకుడు తెలంగాణకు ఇప్పుడు చాలా అవసరముంది. ఆయన ఏపీలో విద్యార్ధులు, యువత భవిష్యత్ అద్భుతంగా మార్చేందుకు అనేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
కానీ తెలంగాణకు కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేరు. అన్నీ సిఎం రేవంత్ రెడ్డే చూసుకుంటున్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల ర్యాంకింగ్ నానాటికీ దిగజారుతోంది.
ఆనాడే ఎన్టీఆర్ ‘సామాజిక తెలంగాణ’కు బీజం వేశారు. కానీ నేటికీ తెలంగాణలో అది సాకారం కాలేదు కనుకనే ఆ పేరుతో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి.
ఎన్టీఆర్ సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తే, సిఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకువచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. మంత్రి నారా లోకేష్ భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యం యువతకు అందిస్తున్నారు.
తెలంగాణలో టీడీపి అధికారంలో లేకపోయినా టీడీపి.. పసుపు జెండా పట్ల అభిమానం కార్యకర్తల గుండెల నిండా ఉంది. వారే తెలంగాణలో టీడీపిని కాపాడుకుంటున్నారు. కనుక తెలంగాణ టీడీపికి సమయం కేటాయించి మళ్ళీ పూర్వ వైభవం తేవాలి,” అని పార్టీ అధిష్టానానికి ఆమె విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళ కేసీఆర్ పాలనలో, ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, నేటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, టీడీపిని తెలంగాణ శత్రువులుగా బీఆర్ఎస్ పార్టీ చిత్రీకరిస్తూనే ఉంది.
దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు ఏకధాటిగా ఈ విద్వేష భావనలని ప్రజల మనసుల్లోకి ఎక్కించినందున, రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినా అభ్యంతరం చెపుతున్నారు.
ఇంతగా విద్వేషం రగుతున్నప్పుడు తెలంగాణలో టీడీపి మళ్ళీ యాక్టివ్ అవడం చాలా కష్టమే. అనవసరమే! దాని వలన టీడీపికి, ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలవుతాయి.
కానీ తెలంగాణలో టీడీపి మళ్ళీ యాక్టివ్ అయితే ‘రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు నాయుడు ఆంధ్రా పాలకులు మళ్ళీ వచ్చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకొని తప్పక రాజకీయ లబ్ది పొందుతుంది.
ఒకప్పుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన ఏపీ ప్రజలు, మన రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు కూడా టీడీపి రావాలని కోరుకుంటే అప్పుడు ఆలోచించవచ్చు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజేపి, కొత్తగా టీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు చూస్తున్నప్పుడు తెలంగాణకు టీడీపి దూరంగా ఉండటమే మంచిదనిపిస్తుంది.
After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…
Nandamuri Balakrishna has agreed to surrender a portion of his residential property for road-widening works…