వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సృష్టించిన ‘బికాంలో ఫిజిక్స్’ హంగామా గురించి తెలియని వారెవరూ లేరని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అంతలా ప్రజలలోకి వెళ్ళడంతో మైనార్టీ కోటాలో దక్కాల్సిన మంత్రి పదవి కూడా జలీల్ ఖాన్ కు దూరమైందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరిగింది. మరి ఇంతలా పాపులర్ అయిన ‘బి.కాంలో ఫిజిక్స్’ అంశాన్ని సినీ జనాలు వాడుకోకుండా ఉంటారా… ఖచ్చితంగా ఏదొక సందర్భంలో పంచ్ ఇవ్వకుండా ఉండరు.
ఇప్పటికే బుల్లితెరపై హైపర్ ఆది లాంటి ‘జబర్దస్త్’ కమెడియన్లు ఈ ‘బికాంలో ఫిజిక్స్ పై పంచ్ లు వేయగా, తాజాగా రామజోగయ్య శాస్త్రి ఒక పాటనే రాసేసారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “అంధగాడు”లో తాజాగా విడుదల చేసిన పాటలో జలీల్ ఖాన్ ‘బికాంలో ఫిజిక్స్’ సాహిత్యం హైలైట్ అయ్యింది. “పిల్ల మైండ్ బ్లోయింగే… సూపర్ డూపర్ నీ గ్లామర్…” అంటూ ప్రారంభమయ్యే ఈ పాటలో ‘బీకాంలోని ఫిజిక్స్ లాగా… నీ నడుమెక్కడే నాజూకు తీగ’ అంటూ లిరిక్ ను వాడి ప్రేక్షకులను అకర్షించే ప్రయత్నం చేసారు.
మాంచి హుషారుగా తెరకెక్కిన ఈ గీతాన్ని సింహా, గీతామాధురిలు తమ స్వరంతో ప్రాణం పోయగా, శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చారు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పాట ఇప్పటివరకు విడుదలైన మూడు పాటల్లోకల్లా ఉత్తమమైనదిగా భావించవచ్చు. బహుశా ‘బికాంలో ఫిజిక్స్’ అన్న సమాధానం చెప్పినపుడు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గానీ, సదరు మీడియా ప్రతినిధి గానీ, ఇంతలా పాపులర్ అవుతుందని ఊహించుకుని ఉండరేమో!



