ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ముల్టీస్టారర్ సినిమా – ఆర్ఆర్ఆర్ ఇటీవలే బల్గేరియా లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో హైదరాబాద్ లో తరువాతి షెడ్యూల్ మొదలు అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే జులై 30, 2020 విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుందని ఆ తేదీన విడుదల అయ్యే అవకాశం లేదని అంటున్నారు. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు ఆ సమాచారం ఇవ్వడంతో జులై 31, 2020న తమ సినిమా ‘భూల్ బులయ్య’ విడుదల అవుతుందని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మన రెండు తెలుగు రాష్ట్రాలకు తప్ప పెద్దగా తెలియని ఇద్దరి యోధుల కథను దేశం మొత్తం పరిచయం చెయ్యాలని రాజమౌళి కృతనిశ్చయంతో ఉన్నారట.
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.



