బాబాయ్ పవన్ కళ్యాణ్ దారిలోనే అబ్బాయ్ రామ్ చరణ్ కూడా అడుగులు వేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఎక్కువ శాతం రీమేక్ చిత్రాలతోనే పవన్ కళ్యాణ్ విజయాలను సొంతం చేసుకున్నాడు. అయితే రామ్ చరణ్ ఇప్పటివరకు నటించిన 9 సినిమాలలో ‘జంజీర్’ (తెలుగులో తుఫాన్) ఒక్క రీమేక్ లోనే నటించాడు. అది కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో మళ్ళీ రీమేక్ ల జోలికి పోలేదు. అయితే ఇటీవల చేసిన సినిమాలు కూడా చెర్రీని తీవ్రంగా నిరాశ పరచడంతో, తమిళ చిత్రం ‘తని ఒరువన్’ రీమేక్ ను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది.
ఇదిలా ఉండగానే మరో పరభాషా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘రాకీ హ్యండ్సమ్’పై చరణ్ చూపులు పడ్డాయని టాక్. ఇటీవల విడుదలయిన ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమా పై హైప్ ని ఏర్పరిచాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ద్వారా ఈ సినిమా స్టోరీ గురించి తెలుసుకున్న చెర్రీ, చాలా ఆసక్తి కనపరిచారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం రామ్ చరణ్ ఇప్పటినుండే ప్రయత్నాలు ప్రారంభించాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ రీమేక్ లైనా చెర్రీకి కావాల్సిన విజయాలను అందిస్తాయేమో..!





