గేమ్ చేంజ్‌ అవుతోందా?

ram-charans-game-changer Pre Release Event

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలోనే టాలీవుడ్‌తో తమ ప్రభుత్వం ఏవిదంగా వ్యవహరించబోతోందో కుండ బద్దలు కొట్టిన్నట్లు చాలా స్పష్టంగా చెప్పేశారు. కనుక సినీ ప్రముఖులతో జరిగిన సమావేశం ఏవిదంగా సాగి ఉంటుందో ఎవరైనా ఊహించుకోగలరు.

ఆ సమావేశం అద్భుతం, అమోఘం అంటూ నిర్మాత దిల్‌రాజు ఎంతగా పొగిడినప్పటికీ దాని సైడ్ ఎఫెక్ట్ మొట్ట మొదట ఆయన సినిమాతోనే మొదలైంది.

ADVERTISEMENT

తెలంగాణ ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తుండటంతో గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రాజమండ్రికి మారింది. ఆదివారం సాయంత్రం రాజమండ్రి సమీపంలో కడియం మండలంలోని వేమగిరిలో గేమ్ చేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ హాజరుకాబోతున్నారు.

నిన్న సిఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ “ఇదివరకు తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్‌లో ఉంటే దానిని హైదరాబాద్‌కు తరలి వచ్చింది. ఇప్పుడు అమరావతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది,” అని అన్నారు. దిల్‌రాజు కూడా తెలుగు సినిమాలకు విజయవాడ పుట్టిల్లు అని చెప్పేశారు. కనుక గేమ్ చేంజ్‌ అవుతున్నట్లే ఉంది.

తెలుగు సినీ పరిశ్రమ వలన తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తోంది. వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి. సినీ పరిశ్రమ వలన హైదరాబాద్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తోంది. కనుక సినీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రానికి బంగారు గుడ్లు పెట్టే బాతు వంటిదే అని చెప్పొచ్చు.

కానీ తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరూ ఆంధ్రాకు చెందినవారే ఉండటం లేదా వారి చేతిలోనే సినీ పరిశ్రమ ఉండటం తెలంగాణవాదులు జీర్ణించుకోవడం కష్టమే. అది సహజం కూడా.

కనుక తెలంగాణకు ప్రత్యేకంగా సినీ పరిశ్రమ అవసరమని వాదించేవారు చాలా మందే ఉన్నారు. కానీ అది వీలుకాకపోవడంతో సినీ పరిశ్రమలో తెలంగాణకు (రిజర్వేషన్లు) ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. వారి గోడు ఎవరూ పట్టించుకోకపోయినా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు తెలుగు సినీ పరిశ్రమకి తన మూలాలు గుర్తుచేసుకోక తప్పడం లేదు.

ఇప్పుడు ఏపీకి సినీ పరిశ్రమ తరలిరావడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. కూటమి ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ వేసి నేరుగా అమరావతికి రమ్మనమని స్వాగతం పలుకుతోంది. కనుక ముందుగా గేమ్ చేంజర్‌తోనే ఈ గేమ్ చేంజ్‌ మొదలైన్నట్లు భావించవచ్చు.

అవునో కాదో తెలియాలంటే డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లతో మరికాస్త స్పష్టత రావచ్చు. విశ్వంభరతో పూర్తి స్పష్టత రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories