ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మని పిచ్చాసుపత్రిలో చేర్చుకోవాలని విశాఖపట్టణంలోని కాంగ్రెస్ నేతలు మెంటల్ హాస్పిటల్ సూపరిండెంట్ కు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. తానూ రూపొందిస్తున్న “వంగవీటి” సినిమాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉంటుందని వర్మ వెల్లడించడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. వర్మకు పిచ్చిపట్టి నోటికొచ్చిన విధంగా వాగుతున్నాడని, మీ ఆసుపత్రిలో చేర్చుకుని అతనికి సరైన చికిత్స అందజేయాలని ఈ వినతి పత్రంలో కోరారు.
దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ద్వారా వర్మ చాలా ఘాటుగా స్పందించారు. “నా మెదడుకి చికిత్స చెయ్యాలని చెప్తున్న ఆ కాంగ్రెస్ వాళ్లకి నా సమాధానం – నాకు కనీసం చికిత్స చెయ్యడానికి మెదడన్నా ఉంది. వాళ్లకి ఆ మెదడు కూడా లేకపోవడం మూలానే అలాంటి కూతలు కూస్తూ, అటువంటి చేష్టలు చేస్తున్నారు. మెదడు లేకుండా కూడా మనుషులు బతికేయొచ్చని నిరూపించిన ఆ అద్భుతమైన కాంగ్రెస్ వాళ్లని అడ్వాన్స్డ్ మెడికల్ రీసర్చ్ కోసం అమెరికా పంపించవలసిందిగా నరేంద్రమోడీ గారికి నేను వినతిపత్రం అందించబోతున్నా” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.





