‘బాహుబలి 2’ ద్వారా ఇండియన్ సినిమా మొదటి సారి 1000 కోట్ల సినిమాను చవిచూసింది. ఇది సాధించడానికే ఎన్నో దశాబ్దాలు పట్టింది. అలాగని తర్వాత వచ్చే భారీ సినిమాలన్నీ కూడా ‘సూపర్ హిట్’ టాక్ వచ్చినా, ఈ ఫీట్ ను అందుకోవడం అసాధ్యం. మరి ‘బాహుబలి 2’ రేంజ్ లో సక్సెస్ అందుకునే సినిమా ఏది? దీనికి సమాధానం లభించడం అందరికీ కష్టతరమేమో గానీ, దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర మాత్రం ఓ సమాధానం ఉంది. ఆ జవాబు పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
అవును… పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటే 1000 కొట్లేంటి… 3000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టగలడు అంటూ వర్మ తనదైన మార్క్ తో ట్వీట్లు చేసారు. ఇందులో వర్మ గారు సెలవిచ్చిన ‘లాజిక్’ ఏమిటో తెలుసా… ప్రభాస్ స్థాయికి 1000 కోట్లు వస్తే… పవన్ కళ్యాణ్ రేంజ్ కు అవలీలగా 3000 కోట్లు వచ్చేస్తాయట. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తలచుకుంటే ‘బాహుబలి 2’ సినిమాను మించిన సినిమా తీయగలడని, అతని అభిమానులంతా ఎన్నికలకు ముందే ఈ సినిమాను తీసేలా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
‘బాహుబలి 2’ని మించిన సినిమాను ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే తీయగలడని, ఎందుకంటే సినిమాలు తీయడంలో పవన్ చాలా ప్రావీణ్యుడు, అలాగే ప్రభాస్ కంటే పెద్ద స్టార్ గనుక… అంటూ వర్మ చేసిన ట్వీట్ ‘ఎటకారపు’ ఆంతర్యం అందరికీ తెలిసిందే. ఇక పవన్ జోలికి రాను, ఫ్యాన్స్ కు కూడా సారీ అంటూ ఇటీవల వర్మ చేసిన వ్యాఖ్యలు అంతా ‘ఉత్తిదే’ అని స్పష్టత ఇచ్చే విధంగా… మళ్ళీ నెట్టింట ఓ ఆట ఆడుకున్నారు. ఎటకారం ఉండొచ్చు గానీ, మరీ ఈ రేంజ్ లోనా… అంటూ నోరెళ్ళబెట్టడం నెటిజన్ల వంతవుతోంది.


