రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌ను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడంతో పోలీసులు అనంతపురం జైలుకు తరలించారు. స్థానిక జడ్పీ హైస్కూలులో పదో తరగతి విద్యార్థిని తరగతిలో ఉన్నప్పుడు, హేమంత్ చెట్లు నరికే విద్యుత్ రంపంతో ఆమెపై దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. మంత్రి నారా లోకేష్ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆమెకు బెంగళూరులో అత్యుత్తమైన వైద్య చికిత్స అందేలా చేయడంతో ఆమె క్రమంగా కోలుకుంటోంది. కానీ ఆమెపై దాడి చేసిన హేమంత్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది.
ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారిపై దాడి చేయబోతే, పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఆ కారణంగా అతని రెండు మోకాళ్ళకు గాయాలయ్యాయి. ఒక కాలు కుళ్ళి పోతుండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆ తర్వాత అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజులు చికిత్సతో కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు.
హేమంత్ ఆవేశంతో, దుందుడుకుతనంతో చేసిన ఈ ఘాతుకానికి బలైన ఆ బాలిక మెల్లగా కోలుకుంటుంటే, అతని జీవితం మాత్రం ఒక్కసారిగా తలకిందులైంది. ఒక కాలు పోగొట్టుకున్న హేమంత్, ఇప్పుడు ఈ కేసులో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ శిక్ష పడితే యావత్ జీవితం జైల్లో గడపక తప్పదు. ఒకవేళ రెండో కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తే అతని జీవితం మరింత దుర్భరంగా మారుతుందని వేరే చెప్పక్కరలేదు.
కనుక క్షణికావేశంలో ఇలాంటి నేరాలు చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ హేమంత్ పరిస్థితి కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం.




