రైతులకే కాదు.. బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీలకు కూడా నీళ్ళే ఆధారం!

Nagarjuna Sagar AP Telangana water dispute

తెలంగాణలో ఇంతకాలం బీఆర్ఎస్‌, ఇప్పుడు టీఆర్ఎస్‌ రెండు పార్టీలు నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి.

నీళ్ళ కోసమే పోరాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకునే ఈ రెండు పార్టీలు, అదే నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయనే విమర్శలను పట్టించుకోవు. తెలంగాణ ప్రయోజనాల కోసమే తమ పోరాటమని చెబుతూ తమ వాదనలను సమర్థించుకుంటాయి.

ADVERTISEMENT

తాజాగా ఏపీ ప్రభుత్వం పల్నాడు జిల్లాలోని 363 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తోంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తీసుకొని 11 మండలాల్లో సుమారు 10 లక్షల మందికి తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు 1.865 టీఎంసీల నీటి వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. సాగర్‌పై ఆధారపడిన నల్గొండ రైతులకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్‌ నేతలు ఆందోళన చేస్తున్నారు. కవిత కూడా సోషల్ మీడియాలో విమర్శలు మొదలుపెట్టారు. ఏపీ ప్రభుత్వం సాగర్ డెడ్ స్టోరేజీ దిగువ నుంచి నీటిని తరలిస్తుంటే రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

అయితే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ 400 అడుగులు కాగా, కనీస డ్రాడౌన్ స్థాయి 510 అడుగులు. పూర్తి నీటి మట్టం 590 అడుగులు. కానీ ఈ స్థాయిల ఆధారంగా రెండు రాష్ట్రాలకు నీటి వినియోగ హక్కులు నిర్ణయించరు. అది సాగు కోసమా లేదా ప్రజల దాహార్తి తీర్చేందుకు తాగునీటి అవసరాలకా అనేది చాలా కీలకం.

తెలంగాణ నేతలు ఏపీ ప్రభుత్వం సొరంగాలు తవ్వుతోందని వాదిస్తున్నారు. కానీ ఏపీ అధికారులు పల్నాడు ప్రజల తాగునీటి అవసరాల కోసం పైప్‌లైన్లు మాత్రమే నిర్మిస్తున్నామని, అదీ.. డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకోవడం లేదని చెబుతున్నారు.

చివరిగా ఒక ప్రశ్న: ఇంతకీ బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాయా? లేక తమ రాజకీయ మనుగడ కోసం ఈ నీళ్ళను వాడుకుంటున్నాయా?

ADVERTISEMENT
Latest Stories