మళ్ళీ అదే మాస్ మంత్రమైతే ఎలా రాజా

Ravi Teja Dhamaka same routine storyమాస్ మహారాజా రవితేజ ధమాకా మరీ భీకరంగా కాదు కానీ చెప్పుకోదగ్గ అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టింది. సహజంగానే మాస్ ఆడియన్స్ కి దీని మీద గురి ఉంది. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, ట్రైలర్లో కొత్తదనం లేకపోయినా ఏదో పైసా వసూల్ లాగా అనిపించడం లాంటి కారణాల వల్ల పబ్లిక్లో ఆసక్తి రేగింది. గత కొంతకాలంగా ఒకటే మూసలో పడిపోయి చేసిన పొరపాట్లే చేస్తూ క్వాలిటీ కంటే కౌంట్ మీదే దృష్టి పెట్టిన రవితేజకి ఈ ఏడాది ఏకంగా రెండు డిజాస్టర్లు పడ్డాయి. అందుకే ధమాకా వాటినుంచి గట్టెక్కిస్తుందన్న నమ్మకం అభిమానుల్లో ఉండేది. సరే యావరేజ్ కంటెంట్ ని లాకొచ్చే ఎనర్జీ రవితేజ బలమన్న సంగతి తెలిసిందే.

ధమాకా కథలో ఎలాంటి కొత్తదనం లేదు. అసలు దాని జోలికి వెళ్తేనే మహాపాపమన్నట్టు రచయిత ప్రసన్న కుమార్ ఎన్నోసార్లు వాడి విసిరేసిన ముక్కలన్నీ తీసుకొచ్చి ఒక మాస్ షర్టు ప్యాంటు కుట్టాడు. అదే దీని కథ. వందల కోట్లు సంపాదించిన తండ్రి ఆస్తి మీద విలన్ కన్నుపడితే దాన్ని వాడి నుంచి కాపాడుకోవడం కోసం మన కథానాయకుడు రకరకాల నాటకాలు ఆడి చివరికి వాడి ఆట కట్టించి సదరు దుర్మార్గ డాన్ గారికి కనువిప్పు కలిగిస్తాడు. సింపుల్ గా సింగల్ లైన్ లో చెప్పాలంటే స్టోరీ ఇదే. ఈ మధ్యలో హీరో వేసే ఎత్తులు, డ్యూయల్ రోల్ ట్విస్టులు, విలన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆడే డ్రామాలు, హీరోయిన్ తో పాటల్లో రొమాన్సులు ఇవన్నీ ఉంటాయి.

ADVERTISEMENT

రొటీన్ పాయింట్ ని తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ట్రీట్మెంట్ లో కొంతైనా వైవిధ్యముంటే ఫ్యామిలీ ప్రేక్షకుల సపోర్ట్ కూడా దక్కుతుంది. కృష్ణ, కిక్, మిరపకాయ్ లాంటివి హిట్ కావడానికి కారణమిదేగా. కానీ ధమాకాలో అన్నీ ఉన్నట్టే అనిపిస్తాయి. కానీ ప్రతి అంశంలోనూ ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది. రవితేజ ఎంతగా నెట్టుకొచ్చినా అది అభిమానులను మెప్పించేందుకు ఉపయోగపడిందే తప్ప సగటు జనాలకు ఇందులో స్పెషల్ ఏంటబ్బా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. రెండు ఫుల్ జోష్ ఇచ్చే పాటలు, ఇంద్ర సినిమా నుంచి తెచ్చిన స్పూఫ్, ఆఫీస్ లో గున్నాగున్నా మామిడి టైపు పాట వీటితో సర్దేసి అసలైన కథా కథనాల విషయంలో చేతులెత్తేయడంతో ధమాకా జస్ట్ ఓకే అనిపించుకుందే తప్ప ఖచ్చితంగా చూడాల్సిందే రికమండేషన్ కింద రాలేకపోయింది.

మాస్ సినిమాలు ఒక ఫార్ములా ప్రకారమే వెళ్తాయి. ఇందులో వాదనకు తావులేదు. పాతికేళ్ల క్రితం స్టార్ హీరోలు ఒకటే కథను కొంచెం అటుఇటు మార్చి తీసుకుంటే ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్లు అయ్యేవి. కానీ ఇప్పుడా సీన్ లేదు. అయినా కూడా త్రినాథరావు జంధ్యాల నుంచి త్రివిక్రమ్ దాకా, చిరంజీవి నుంచి అల్లరి నరేష్ దాకా అందరినీ అనుకరించి నవ్వించే ప్రయత్నంలో తన ఒరిజినాలిటీ మిస్ అయ్యాడు. రవితేజ హుషారు, శ్రీలీల గ్లామర్ పుణ్యమాని ఏదోలా గట్టెక్కొచ్చేమో కానీ ఈ రెండు వీక్ గా ఉండింటే మాత్రం మరో రామారావు, ఖిలాడీ సరసన చేరేది. ఫైనల్ గా ఫలితం ఎలా ఉండబోతున్నా రవితేజకు ధమాకా ఆరంజ్ సిగ్నల్ లాంటిది. రెడ్ పడక ముందే కొత్తగా ఆలోచించడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories