ఇకపై కోనసీమకు బదులు రాయలసీమ అనుకోవాలేమో?

Rayalaseema Rising Global Horticulture Hub

దూరదృష్టితో గొప్ప ఆలోచనలు చేయగల సామర్ధ్యం తనకు ఉందని సిఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఐటి కంపెనీల ఏర్పాటుతోనే నిరూపించి చూపారు. సాగునీటి ప్రాజెక్టులను ఔపోసన పట్టిన హరీష్‌ రావు వంటి ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సైతం చంద్రబాబు నాయుడుని మెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో గొప్ప ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అదే రాయలసీమను గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనుకోవడం.

ADVERTISEMENT

సీమలో నీటి కరువు ఉంది కదా? అక్కడ ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. కానీ ఈ సమస్య గురించి చంద్రబాబు నాయుడు ముందే ఆలోచించి శ్రీశైలం నుంచి కుప్పం వరకు 800 కిమీ మేర కృష్ణా జలాలను పారిస్తున్నారు.

అలాగే వెలిగొండ ద్వారా కడప, కర్నూలు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సాగుతాగు నీరు అందించేందుకు సుమారు 43.50 టీఎంసిల సామర్ధ్యంతో నల్లమల్ల సాగర్‌ని నింపిస్తున్నారు. దీంతో ఈ నాలుగు జిల్లాల్లోని సుమారు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నిరంతర సాగునీరు అందుతుంది.

మౌలిక వసతులు లేకుండా ఏ ప్రాజెక్టు విజయవంతం కాదు. కనుక ఓ పక్క సీమ జిల్లాలకు నీటి సౌకర్యం కల్పిస్తూనే, మరో పక్క ‘రాయలసీమ రైజింగ్’ పేరుతో రూ.40,352 కోట్లు వ్యయంతో సీమ జిల్లాలలో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

వీటి తర్వాత దశలో మరో రూ.60,000 కోట్లు ప్రైవేట్ రంగ పెట్టుబడులతో ఉద్యానవన పంటలకు అవసరమైన ఉత్పత్తి, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, బ్రాండింగ్, రవాణా, దేశవిదేశాలలో మార్కెటింగ్ వంటి సకల సౌకర్యాలు కల్పించబోతున్నారు.

అంటే పంటలకు నీళ్ళు అందించడం మొదలు ఉద్యానవన ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు అంతా ప్రణాళికాబద్దంగా నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ సిద్దం చేశారన్న మాట!

నేడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లాంచనంగా ఈ ‘రాయలసీమ రైజింగ్’ పేరిట జరిగే ‘ఉద్యాన హబ్’ పనులను ప్రారంభిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారనే కంటే, ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిగా చేశారని చెప్పుకోవడం సముచితంగా ఉంటుంది.

తద్వారా డబుల్ ఇంజిన్ సర్కార్ పని తీరు ఇలా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకోగలుగుతుంది.

ఇక ఈ ‘రాయలసీమ రైజింగ్’ ప్రాజెక్టులో భాగంగా అటు అనంతపురం నుంచి, చిత్తూరు, తిరుపతి, అన్నమ్మయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల,, కడప, ప్రకాశం, ఇటు మార్కాపురం వరకు అన్ని జిల్లాలలో 303 మండలాలోని 5,869 గ్రామాలలో ఈ మౌలికవసతుల కల్పన, ఉద్యాన హబ్ పనులు జరుగబోతున్నాయి.

వీటిని 2026-29 సంవత్సరాలలోగా మూడు దశలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న 20.77 లక్షల ఎకరాలతో పాటు అందుబాటులోకి వచ్చిన జలవనరుల ద్వారా మరో 9 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది.

రాయలసీమలో 29.77 లక్షల ఎకరాలలో ఉద్యానవన పంటలు పండుతుంటే, బహుశః ఇకపై ‘కోనసీమ’ బదులు ‘రాయలసీమ’ అని అందరూ చెప్పుకునే రోజులు ఎంతో దూరం లేదనిపిస్తుంది.

నాడు హైదరాబాద్‌కు ఐటి కంపెనీలు రప్పిస్తున్నప్పుడు ఏవిధంగా ఆ ఉద్యోగాలకు తగిన అర్హత, నైపుణ్యం పొందేందుకు ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించి ఏర్పాటు చేయించారో, అదేవిధంగా ఇప్పుడు ఈ ఉద్యానరంగంలో అర్హత, నైపుణ్యం, శిక్షణ కొరకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు చేయిస్తున్నారు. రిలయన్స్ సంస్థ అధ్వర్యంలో వంద ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న ఇది దేశంలోనే మొట్ట మొదటిది.

రాయలసీమ అంటే కరువు, నిరుద్యోగం, వలసలు, ఫ్యాక్షనిజం అనే భావనలను సమూలంగా తుడిచి పెట్టేసి దేశానికే ‘ఫ్రూట్ బౌల్’గా, రాష్ట్రానికి పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి చేసి చూపబోతున్నారు సిఎం చంద్రబాబు నాయుడు. కనుక వీటన్నిటితో రాబోయే 3-4 ఏళ్ళలోనే రాయలసీమ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది.

పాలకులకు నిబద్దత, పట్టుదల, దూరదృష్టి ఉండాలే కానీ అభివృద్ధి చేయడానికి ఏదీ అవరోధం కాదని సిఎం చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించి చూపబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories