17 ఏళ్ళ నిరీక్షణ, ఇప్పుడు హ్యాట్-ట్రిక్ వేట..!

RCB IPL Hat Trick

ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. అభిమానులకు అది ఒక పండుగ! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఫ్రాంచైజీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్థానం ప్రత్యేకం. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, యువరాజ్ సింగ్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఈ జట్టు క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

రాహుల్ ద్రవిడ్, డేనియల్ వెటోరి, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజ కెప్టెన్లు జట్టును నడిపించినా, తొలి 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్‌ను అందుకోలేకపోయింది. పలుసార్లు ఫైనల్ వరకు వెళ్లినా చివరి మెట్టుపై బోల్తా పడింది. అభిమానులు మాత్రం ప్రతీ ఏడాది కొత్త ఆశలతో “ఈ సాలా కప్పు నందే” అంటూ జట్టుకు అండగా నిలిచారు.

ADVERTISEMENT

అయితే 2025లో ఆ 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. రాజత్ పటిదార్ నాయకత్వంలో RCB తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన రాజత్, కోట్లాది మంది అభిమానుల కలను నిజం చేశాడు.

ఆ టైటిల్ విజయంతో ఆటగాళ్లే కాదు, అభిమానులు కూడా చాలా రోజుల పాటు ఆ సంబరాల నుంచి బయటకు రాలేకపోయారు. ‘0 ట్రోఫీలు’ అంటూ ఎగతాళి చేసిన వాళ్లకు మైదానంలోనే సమాధానం దొరికింది. అయితే ఆ విజయం కేవలం రాజత్ పటిదార్ లేదా ఆటగాళ్ల ప్రతిభకు మాత్రమే దక్కిన ఘనత కాదు. తెరవెనుక జట్టు నిర్మాణం, సరైన ఆటగాళ్ల ఎంపిక, వ్యూహాలు కూడా కీలక పాత్ర పోషించాయి.

ముఖ్యంగా దినేశ్ కార్తీక్, జో బోబాట్ వంటి వ్యక్తుల సహకారం RCB విజయ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచింది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఆటగాళ్ల సామర్థ్యాన్ని గుర్తించి వినియోగించుకోవడం జట్టు విజయానికి బలమైన పునాదిగా మారింది. ఒకసారి టైటిల్ గెలిస్తే అదృష్టం అన్నారు.. ఫ్లూక్ అన్నారు.. కానీ RCB రెండోసారి కూడా అదే స్థాయిలో సత్తా చాటింది.

2026లో గుజరాత్ టైటాన్స్‌ను తమ హోమ్-గ్రౌండ్ లో నే ఫైనల్లో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న మూడో జట్టుగా నిలిచింది. తొలి టైటిల్ కోసం 17 ఏళ్లు ఎదురుచూసిన జట్టు, ఆ తర్వాతి రెండేళ్లలోనే రెండుసార్లు విజేతగా నిలవడం నిజంగా అద్భుతమైన పరిణామం!

ఇప్పుడు RCB ముందున్న లక్ష్యం మరోసారి టైటిల్‌ను గెలవడమే కాదు.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం. వరుసగా మూడు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచి ‘హ్యాట్రిక్ టైటిల్స్’ సాధించిన తొలి జట్టుగా అవతరించే అవకాశం వారి ముందుంది. ఒకప్పుడు ఒక్క ట్రోఫీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన జట్టు, ఇప్పుడు హ్యాట్రిక్ కోసం పోటీపడుతుండటం కాలం తెచ్చిన మార్పుకు నిదర్శనం.

ఇక 2027 సీజన్‌కు ముందు జరగనున్న మినీ వేలంపై కూడా RCB అభిమానుల దృష్టి పడింది. ఇప్పటికే తమ టైటిల్ విన్నింగ్ జట్టులోని కీలక ఆటగాళ్లను కొనసాగిస్తూ ఫ్రాంచైజీ పెద్దగా మార్పులకు వెళ్లలేదు. రూ.14.15 కోట్ల పర్స్‌తో మినీ-ఆక్షన్ లో ఆర్.సి.బీ జట్టు యాజమాన్యం ఏ ఆటగాడి కోసం బిడ్ చేస్తారో చూడాలి. మొత్తం జట్టును నిర్మించుకోవాల్సిన అవసరం లేకుండా, అవసరమైన బ్యాకప్ ఆటగాళ్లపై దృష్టి పెట్టవచ్చు.

అయితే వరుసగా రెండు టైటిళ్లు సాధించడం ఎంత గొప్ప విషయమో, మూడోసారి అదే విజయాన్ని పునరావృతం చేయడం అంతకంటే పెద్ద సవాల్. కీలక ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్, బెంచ్ బలం, విదేశీ ఆటగాళ్ల లభ్యత వంటి అంశాలు ఈ ప్రయాణంలో కీలకం కానున్నాయి. చిన్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటే హ్యాట్రిక్ లక్ష్యానికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

ఒకప్పుడు ట్రోఫీ లేని జట్టుగా విమర్శలు ఎదుర్కొన్న RCB, ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సృష్టించే అంచున నిలిచింది. విరాట్ కోహ్లీ నుంచి రాజత్ పటిదార్ వరకు, అభిమానుల నుంచి యాజమాన్యం వరకు ప్రతి ఒక్కరూ ఈ విజయ ప్రయాణంలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత వరుసగా రెండు టైటిళ్లు సాధించిన RCB, మూడోసారి కూడా ఛాంపియన్‌గా నిలిచి ‘హ్యాట్రిక్ హీరోస్’గా చరిత్ర సృష్టించగలరా?

ADVERTISEMENT
Latest Stories