వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ దుర్భేద్యమైన కోటరీ ఉందని, దానిని ఎవరూ ఛేదించలేరని, కనీసం ఆయనను కూడా కలవలేరని గిట్టనివారు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉంటారు.
కాదు కాదు.. ఆ కోటరీని ఆయన కూడా ఛేదించుకొని బయటపడలేరని విజయసాయిరెడ్డి వంటి వారు చెబుతుంటారు.
కనుక వైసీపీ ఆలోచనలు, విధానాలు, వ్యూహాలు, కూటమిని ఉద్దేశించి చేస్తున్న విమర్శలన్నీ ఆయనే నిర్ణయిస్తున్నారని అనుకోలేము. ఒకవేళ ఆయనే నిర్ణయిస్తున్నా వాటిపై కోటరీ ప్రభావం ఉండే ఉంటుందని విజయసాయిరెడ్డి వంటి వారి మాటలను బట్టి నమ్మాల్సి వస్తుంది.
నాడు అమరావతి మొదలు నేడు మావిగన్ వరకు, శాసన సమావేశాలకు మొహం చాటేయడం, దానికో కుంటిసాకు చెప్పడం, కనీసం ప్రజల మధ్యకు వెళ్ళకపోవడం, పాదయాత్ర చేయాల్సిన సమయంలో జైళ్ళలో ఉన్న నేతల పరామర్శయాత్రలు చేయడం, రప్పారప్పా… ఒకటా రెండా.. కోకొల్లలు!
జగన్ 2.0 మొదలు స్థానిక సంస్థల ఎన్నికల్లో హంగామా వరకు జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారో? కానీ ప్రతి సలహాకు వైసీపీ మూల్యం చెల్లిస్తూనే ఉంది.
తాజాగా వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి తన కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తే, దానిపై సాక్షిలో ‘బాబుతో చెట్టాపట్టాల్’ అనే కథనం వండి వార్చాలనే ఆలోచన ఎవరిదో తెలియదు కానీ అదీ బెడిసికొట్టింది.
కనుక నష్ట నివారణ కోసం వెంటనే ఆ కథనం హెడ్డింగ్ మార్చినప్పుడు అక్కడితో ఆ వ్యవహారాన్ని వదిలేసి బయటపడవచ్చు. కానీ ‘షర్మిల పోస్టుపై లోకేష్ పూనకాలు.. నెటిజన్ల కౌంటర్’ అని సమర్థించుకుంటూ మరో కథనం వేయాలనే ఆలోచన ఎవరిదో?
పైగా మళ్లీ వైఎస్ షర్మిల ఫోటోతో ‘అప్పుడు మౌనం.. ఇప్పుడు రోదన’ అంటూ మరో స్టోరీ వేయాలనే ఆలోచన ఎవరిదో? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ప్రశ్నలే మిగులుతాయి తప్ప సమాధానం ఉండదు.
కనుక వైసీపీ అధినేతకు ఇంత చక్కగా శల్యసారథ్యం చేసేవారు ఉన్నంతకాలం కూటమిలో అందరూ నిశ్చింతగా ఉండవచ్చు. కాగల కార్యం గంధర్వులే చక్కబెడతారన్నట్లు, ఈ శల్య కోటరీయే కూటమిని తప్పక మరోసారి గెలిపిస్తుంది!




