కన్నుల పండుగగా జరిగిన ఐఫా వేడుకలో హీరోయిన్ ఛార్మి కన్నీటి పర్యంతమవ్వడం, ఆమె పక్కనే కూర్చొన్న మరో ముద్దుగుమ్మ శ్రియాశరణ్ ఆమెను ఓదార్చడం హాట్ టాపిక్ గా మారింది. అయితే సాధారణంగా ధైర్యంగా, చలాకీగా ఉండే ఛార్మి ఇలా ఎందుకు కన్నీరు పెట్టిందనేది ఎవరికీ అర్థం కాని విషయం.
దీనికి గల కారణం… తన కెరీర్ వెనుకబడిందనో, ఈ అవార్డుల ఈవెంట్ లో తనకు సరైన గుర్తింపు రాలేదనో కాదట! ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ పొందిన దేవిశ్రీ ప్రసాద్, తన తండ్రిని ఉద్దేశిస్తూ “నాన్నకు ప్రేమతో” టైటిల్ సాంగ్ పాడుతూ చేసిన స్టేజ్ పై ఇచ్చిన పర్ ఫామెన్స్ చూసి ఛార్మి కన్నీటి పర్యంతమైందని తెలిసింది.
ఇటీవలే మరణించిన తన తండ్రి సత్యమూర్తికి ట్రిబ్యూట్ గా డీఎస్పీ ఈ పాట పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిధుల్ని కదిలించి వేసిన ఆ పాటకు, ఛార్మి కూడా ఉద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టిందని అంటున్నారు. డీఎస్పీ ఫాదర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆమె ఇలా చలించిపోయిందని సమాచారం. గత డిసెంబరులో సత్యమూర్తి మరణించాక దేవిశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు మొట్టమొదట ఛార్మియే హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్ళిన విషయం తెలిసిందే.





