అద్దెకు బాయ్‌ ఫ్రెండ్.. ఆశ్చర్యం.. కాదు అప్రమత్తం!

Rent a Boyfriend Scam in Hyderabad

అవును ఇప్పుడు సోషల్ మీడియాలో ‘రెంట్ ఏ బాయ్‌ ఫ్రెండ్’ ట్రెండ్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ యువతని, ఒంటరిగా ఉంటున్న మహిళలను అప్రమత్తం చేశారు.

కాఫీ, సినిమా, షాపింగ్, వీకెండ్ విహార యాత్రలు దేనికైనా బాయ్‌ ఫ్రెండ్‌ ఏర్పాటు చేస్తామంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రకటనలు ఇస్తున్నారు. అంతేకాదు.. దసరా, దీపావళి వంటి పండుగ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ ఉచ్చులో చిక్కుకోవద్దని విసి సజ్జనార్‌ హెచ్చరించారు. చదువులు, ఉద్యోగాల రీత్యా హాస్టళ్ళలో ఉంటున్న యువతులు, విడాకులు లేదా భర్త మరణంతో ఒంటరి అయిన మహిళలు వీరి టార్గెట్ అని విసి సజ్జనార్‌ హెచ్చరించారు.

ఇక్కడ చర్చ బాయ్‌ ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవడం సబబా కాదా?తీసుకోవాలా? వద్దా?అనేది కాదు. ఈ పేరుతో సైబర్ నేరగాళ్ళు విసురుతున్న వలలో చిక్కకుండా భద్రంగా ఉండటమే ముఖ్యం.

రూ.499కే గంటపాటు కాఫీ మీటింగ్, రూ.1,249కే సినిమా డేట్, రూ.1,499కే షాపింగ్, రూ.1,999కే ఈవెంట్లు, రూ.4,499కే పది గంటల ప్యాకేజీ అంటూ ఆకర్షణీయమైన రేట్లు కూడా ప్రకటిస్తున్నారు.

ముందుగా బుకింగ్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం, లేదా మహిళల వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేయడం లేదా బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయని విసి సజ్జనార్‌ హెచ్చరించారు.

ఇంకో ప్రమాదకరమైన అంశం ఈ ప్రకటనల్లో ఉపయోగిస్తున్న ఫొటోలు. ఆకర్షణీయంగా కనిపించే యువకుల ఫొటోలను ఏఐ సాయంతో నకిలీ ప్రోఫైల్స్ సృష్టించి మహిళలకు వల వేస్తున్నారని విసి సజ్జనార్‌ తెలిపారు.

ఒక్కసారి వారితో చాటింగ్ మొదలైతే ఆ తర్వాత మహిళల వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లు సేకరించడం మొదలుపెడతారని కనుక ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ ఆలోచన కూడా రానీయవద్దని హెచ్చరించారు.

భారత్‌లో సోషల్ మీడియాపై ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్లనే సైబర్ నేరగాళ్ళు దీనిని ఈవిధంగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పక తప్పదు. కనుక పాలకులు కూడా ఇలాంటి నేరపూరితమైన ప్రకటనలపై దృష్టి సారించి కట్టడి చేయాల్సి ఉంది. ప్రతీసారి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వివేకం అనిపించుకోదు కదా?

ADVERTISEMENT
Latest Stories