తాజాగా మళ్ళీ తెలంగాణాలో వెలుగు చూసిన “ఓటుకి నోటు’’ కేసుపై సామాన్య ప్రజానీకం భగ్గుమంటున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో రాజీ ధోరణిని అవలంభించి, రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ ఒక్క కేసులోనే కాదు, గతంలో వెలుగు చూసిన అనేక ముఖ్య కేసులలో “రాజకీయ నీతి” ఈ విధంగానే ఉందన్న నిజాలను నిపుణులు ధృవీకరిస్తున్నారు.
నిజంగా ఈ కేసులలో చిత్తశుద్ధిగ వ్య్వహరించాలంటే అధికార ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ కు నిజాలు నిగ్గు తేల్చడం చిటికెలో పని అని అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఇంత కాలం ప్రభుత్యం ఎందుకు ఎదురుచూస్తూ ఉందన్నది రాజకీయ విమర్శకుల ప్రశ్న. ఇదే సమయంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో గమ్మునుంది.
అంటే ఈ రెండు కేసులను ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు బెదిరించుకోవడానికే అన్న విమర్శలు గతంలోనే విశ్లేషకులు వ్యక్తపరచగా, తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని బలపరిచే విధంగా చర్యలు తీసుకుంటోంది. మహాకవి “శ్రీశ్రీ’’ ప్రస్తావించిన “కాదేదీ కవితకనర్హం’’ అన్నట్లు, మన రాజకీయ నాయకులు “కాదేదీ రాజకీయానికనర్హం’’ అనే విధంగా ‘ప్రజాసేవ’ అనే రాజకీయాలు చేస్తున్నారు.





