తెలుగుదేశం పార్టీకి షాకిచ్చి, టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్, వివేకానంద గౌడ్ లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీటీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి స్థానంలో ఉపనేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఆ పదవిలో నియమించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు కూడా చంద్రబాబు ఓ లేఖ రాశారు.
తాజా పరిణామాలపై స్పందించిన రేవంత్ రెడ్డి, “ఎర్రబెల్లి దయాకర్ రావు ఆది నుంచి టీఆర్ఎస్ వర్గాలతో సన్నిహితంగా ఉన్నారని, నిన్నటి వరకూ రహస్యంగా సాగిన ఆ స్నేహబంధం, ఇప్పుడు బట్టబయలైందని అన్నారు. ఇప్పటివరకూ రాత్రిపూట ఎవరికీ తెలియకుండా టీఆర్ఎస్ నేతలను కలిసే ఎర్రబెల్లి ఇప్పుడిక పగలు కూడా కలుస్తాడని, అంతకు మించి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కులాల వారీగా రాజకీయ నేతలు ఏకమవుతున్నారని, అందులో భాగంగానే ఎర్రబెల్లి పార్టీ మార్పు జరిగిందని చెప్పిన రేవంత్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే లేకుంటే పాలకుర్తి నుంచి ఆయన గెలిచేవాడా? అని ప్రశ్నించారు. దమ్ముంటే అందరి చేత రాజీనామా చేయించి, మళ్ళీ గెలిపించుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు.





