గత కొన్ని రోజులుగా తెలంగాణాలో హాట్ టాపిక్ అవుతున్న రేవంత్ రెడ్డి ఉదంతం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల నుండి తిరిగి వస్తే గానీ తేలదు. అయితే ఈ లోపున జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతున్న నేపధ్యంలో… పార్టీలోని కీలక బాధ్యతల నుండి రేవంత్ రెడ్డిని తప్పించిన వైనం తెలిసిందే. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి… చంద్రబాబు దేశంలో లేనపుడు పదవుల నుండి తొలగిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
నన్ను జైలుకు పంపించిన వ్యక్తికి అనుకూలంగా మా పార్టీ నేతలే మాట్లాడితే ఎలా? కనీసం చంద్రబాబు వచ్చేవరకు కూడా ఆగే ఓపిక లేదా? రెండు రోజుల్లోనే పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష, శాసనసభ పక్షనేత పదవుల నుండి నన్ను తొలగిస్తారా? అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు రేవంత్ రెడ్డి. అయితే అదే చంద్రబాబు విదేశాలలో ఉన్నపుడు రాహుల్ గాంధీతో భేటీ కావడం అనేది రేవంత్ సముచితంగా భావిస్తున్నారా?
టిడిపి నేతలు చేసింది తప్పేనని భావిస్తే… మరి తాను చేసిందేమిటో కూడా రేవంత్ ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది కదా! కనీసం తాను ఎందుకు కలిసానో అన్న విషయం మీడియా ముఖంగా కూడా చెప్పని రేవంత్ రెడ్డి, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అంటూ మరో పక్కన కాంగ్రెస్ నేతలను ఆలింగనం చేసుకుంటూ మీడియాలకు ఫోజులివ్వడం ఎంతవరకు సమంజసమో పునరాలోచించుకుంటే మంచిదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడూ లాజిక్ గా మాట్లాడి ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టే రేవంత్ రెడ్డి, ఈ సారి తానే లాజిక్ లెస్ గా మాట్లాడడం విశేషం.





