
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన తొలిరోజునే బిఆర్ఎస్ నేతలకు, ఉన్నతాధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగానే, ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ రావు తెలంగాణ ఏసీబీకి కాళేశ్వరంలో అవినీతిపై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్ ఇచ్చారు!
కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకొనే కాళేశ్వరం ప్రాజెక్టుని వారు ఏటిఎంలావాడుకొంటూ వేలకోట్లు బొక్కేసారని రేవంత్ రెడ్డి మొదలు ప్రధాని నరేంద్రమోడీ వరకు అందరూ పదేపదే ఆరోపించిన సంగతి తెలిసిందే.
కాళేశ్వరంలో మొట్టమొదటిదైన మేడిగడ్డ బ్యారేజ్‌లో కొంతమేర ఎన్నికలకు ముందే క్రుంగిపోయింది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరూ దానిని స్వయంగా పరిశీలించి, కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వలననే నాసిరకం పనులు జరిగాయని, అందుకే బ్యారేజి అప్పుడే క్రుంగి పోయిందని ఆరోపించారు.
ఇప్పుడు దీనిపై అప్పుడే ఏసీబీకి ఫిర్యాదు అందింది. మాజీ సిఎం కేసీఆర్, మాజీ సాగునీరు, ఆర్ధిక మంత్రి హరీష్ రావు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టులో ప్రధాన కాట్రాక్టర్ మేఘారెడ్డిలు వేలకోట్ల అవినీతికి పాల్పడిన్నట్లు దానిలో పేర్కొన్నారు.
కనుక త్వరలోనే దానిపై కూడా విచారణ మొదలైతే కేసీఆర్ కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి, అధికారులకు కూడా కొత్త కష్టాలు మొదలవుతాయి.
అయితే రేవంత్ రెడ్డి అప్పుడే ఎందుకు ఇంత స్పీడు?అంటే రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ముసుగేసుకొని పడుకొన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నిద్రలేపి పరుగులు పెట్టించి అధికారంలోకి తేగలిగారు. కనుక ఆయన నాయకత్వ పటిమపై ఇప్పుడు ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. కనుక రాష్ట్ర ప్రజలు ఆయన నుంచి చాలా ఆశిస్తుంటారు. ముఖ్యంగా పదేళ్ళలో కేసీఆర్ నిర్ణయాలు, విధానాలు, వైఫల్యాల వలన నష్టపోయినవారు రేవంత్ రెడ్డి వాటిని సరిదిద్దాలని ఎదురుచూస్తుంటారు.
రెండోది రేవంత్ ప్రభుత్వం మనుగడ కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుపైనే ఉంది. కనుక ప్రజలను సంతోషపరచడంతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచి వారిని తమవైపు తెచ్చుకోవడం చాలా అత్యవసరమే.
బహుశః అందుకే రేవంత్ రెడ్డి ఇంత మెరుపు వేగంతో ముందుకు సాగుతున్నారనుకోవచ్చు. కానీ అతివేగం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ చెపుతూనే ఉంటారు కదా?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…