
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అతిరధ మహరధులు అందరూ తరలివచ్చారు. సుమారు 50 వేల మంది సామర్ధ్యం కలిగిన ఎల్బీ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే సిఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్, బారికేడ్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది గ్యాస్ కట్టర్స్ తో కట్ చేసి తొలగించడం ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రసంగిస్తూ బలిదానాలతో సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఇకపై నిరంకుశ, అప్రజాస్వామికపాలన అంతమైందని ప్రజాపాలాన్ ప్రారంభమైందని సూచించేందుకే ప్రగతిభవన్ చుట్టూ కేసీఆర్ ఏర్పాటు చేసుకొన్న ఇనుపకంచెలను, బారికేడ్లను తొలగింపజేశామని చెప్పారు.
ప్రమాణ స్వీకారాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆరు ఆరు గ్యారెంటీలకు సంబందించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. తర్వాత రజని అనే దివ్యాంగురాలికి ప్రభుత్వోద్యోగం కల్పిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌పై రెండో సంతకం చేసి ఆమె చేతికి అందించారు.
రేవంత్ రెడ్డితో పాటు 11 మంది సీనియర్లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో రేవంత్ రెడ్డి చెల్లెమ్మా అని ఆప్యాయంగా పిలిచే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, కొండా సురేఖ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవుల పంచాయితీలు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తయింది కనుక ఎవరెవరెవరికి ఏ శాఖలు లభిస్తాయనేది త్వరలో ప్రకటించనున్నారు.
తెలంగాణ చరిత్రలో పదేళ్ళ ఉద్యమాల సమయం, పదేళ్ళ కేసీఆర్ పాలనతో రెండు దశాబ్ధాలు గడిచిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో మరో కొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది. మొదటి రెండు అధ్యాయాలలో రెండు విభిన్నమైన పరిస్థితులు, సమస్యలు, ఆలోచనలు ఉండేవి.
ఇప్పుడు అన్ని విధాలుగా అభివుద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్ చేతికి వచ్చింది. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూలనావలా సాగిపోగలదు. కానీ ఎన్నికలలో గెలిచేందుకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలే ఆయన ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా గుదిబండగా మారే అవకాశం ఉంది. వాటిని అమలుచేయాలంటే అదనంగా మరో లక్ష కోట్లు అవసరం పడవచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరో పక్క ప్రభుత్వం పడిపోకుండా మరింత మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొని స్థిరత్వం సాధించడం చాలా అవసరం. కనుక ఈ రెండూ కాంగ్రెస్ సొంత సమస్యలే తప్ప తెలంగాణ సమస్యలు కావు. ఈ సమస్యలను అధిగమించగలిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూలనావలా సాగిపోగలదు లేకుంటే టేకోవర్ చేయడానికి కేసీఆర్ ఉండనే ఉన్నారు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…