
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ని టార్గెట్ చేసుకొని విమర్శిస్తుండేవారు. కానీ హటాత్తుగా రూట్ మార్చి, అయన కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నారు.
కేటీఆర్ తనలాగ గడ్డం పెంచినంత మాత్రాన్న ఎన్నటికీ సిఎం కాలేరంటూ రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని వదిలిపెట్టి కేటీఆర్ వెంట పడుతున్నారు దేనికి?అంటే కేసీఆర్‌కు ఎన్ని సవాళ్లు విసిరినా, ఎంతగా విమర్శించినా అయన కానీ, బీఆర్ఎస్ నేతలు గానీ స్పందించడం లేదు. పైగా తెలంగాణను సాధించినందుకు కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉంటుంది.
కనుక ఆయనను విమర్శించడం కంటే ఆయన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు బయట పెడితే సరిపోతుందనే ఉద్దేశ్యం కావచ్చు. లేదా కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేని నిసహాయ స్థితిలో ఉన్నారని కావచ్చు.
కనుక వచ్చే ఎన్నికలలో తాను కేటీఆర్ నేత్రుత్వంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాల్సి ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారని భావించవచ్చు.
ఇందుకు మరో బలమైన కారణం కూడా కనిపిస్తుంది. కేసీఆర్ పేరుతోనే కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు.
కనుక తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్‌ని ‘జీరో’ చేసి, కేటీఆరే బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారనే భావన తెలంగాణ ప్రజలకు కలిగించగలిగితే బీఆర్ఎస్ పార్టీ పునాది దెబ్బ తింటుందని రేవంత్ రెడ్డి ఆలోచన కావచ్చు.
కానీ రేవంత్ తాజా వ్యూహం వలన కేటీఆర్‌కు కొంత రాజకీయ మైలేజ్ లభిస్తుంది. నాడు తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రధాన ప్రత్యర్ధిగా, తన సమ ఉజ్జీగా అంగీకరించడానికి కేసీఆర్ ఇష్టపడకనే, ప్రధాని మోడీపై కత్తులు దూసి ఎదురు దెబ్బలు తిన్నారు.
ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా మాట వరుసకు మోడీ, గీడీ అని అంటున్నా తన ప్రత్యర్ధి, సమ ఉజ్జీగా కేటీఆర్ అని అంగీకరించినట్లే అనిపిస్తుంది. లేకుంటే కేటీఆర్‌ని టార్గెట్ చేసుకొని యుద్ధం చేయరు. కనుక ఈ కోణంలో నుంచి చూస్తే, ఇది కేటీఆర్ సాధించిన విజయమేనని చెప్పొచ్చు.
కనుక రేవంత్ కొత్త వ్యూహంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో ఏ పార్టీ లబ్ది పొందుతుంది? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
Actress Priya Bhavani Shankar is reportedly preparing for a new chapter in her personal life,…
Pawan Kalyan has made it clear that his responsibilities as Andhra Pradesh Deputy Chief Minister…