టాప్ ఇండియన్ డైరెక్టర్ గా పేరు గాంచిన శంకర్ కు ఖచ్చితంగా హిట్ కావాలి. ఓ వైపు వరుస ఫ్లాప్ లు మరో వైపు ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి పేరు మారుమ్రోగడం… దీంతో శంకర్ పేరు ఒక మెట్టు కిందికి వెళ్ళిందనేది అందరూ అంగీకరించే విషయమే. జనవరి 2018లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ తప్ప ఏమీ విడుదల కాకపోవడంతో, ఎలాంటి అంచనాలు లేకుండా ఉంది.
కనీసం ఓ టీజర్ అయినా ప్రేక్షకులను పలకరిస్తే… కొంత స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ముందుగా రావాల్సిన టీజర్ సమాచారం లేదు గానీ, ఓ ఆరు నెలల తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోన్న ధియేటిరికల్ ట్రైలర్ హంగామా మాత్రం సోషల్ మీడియా వేదికగా బాగా జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన “రోబో 2.0” ట్రైలర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా భారీ ప్రచారం జరుగుతోంది.
సినిమా జనవరిలో విడుదల కానున్న నేపధ్యంలో… ఒక నెల ముందుగా ట్రైలర్ విడుదల ఉంటుంది కాబట్టి, ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే ఆరు నెలల తర్వాత రాబోయే ట్రైలర్ ఐ ఫీస్ట్ గా ఉంటుందని ఇప్పటి నుండే హంగామా చేయడం ఎంతవరకు సమంజసం?! అసలు శంకర్ సినిమాలంటేనే కంటికి ఇంపుగా ఉంటాయి. డిజాస్టర్ గా మిగిలిన ‘ఐ’ మూవీ కూడా కన్నులవిందుగా ఉంటుంది. ఇందులో కొత్తగా చెప్పడానికేం లేదు. ఏదో “రోబో 2.0” సినిమాను కాస్త పబ్లిసిటీ పరంగా లేపడానికి, మీడియా వర్గాలలో కాస్త హంగామా చేయడానికి తెరపైకి ట్రైలర్ ను తీసుకువచ్చినట్లుగా కనపడుతోంది.



