పిచ్చి సర్కస్ ఫీట్లకు ప్రేక్షకుల చీవాట్లు

Rohit Shetty Cirkusసినిమాలకు సంబంధించి ప్రేక్షకులను ఎప్పుడూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. అంటే మనం ఏది చూపిస్తే అదే ఎక్కువని ఫీలైతే బాక్సాఫీస్ వద్ద నగ్నంగా నిలబడాల్సి వస్తుంది. ఎంత తోపైనా సరే ఈ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే పతనం తప్పదు. ఇది చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు దర్శకులు హీరోలకు వర్తిస్తుంది. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళనే మొండి వాదన చెల్లదని వీలైనంత త్వరగా గుర్తించకపోతే డ్యామేజ్ తీవ్రమైపోయి మార్కెట్ లో పరువును తాకట్టు పెట్టేస్తుంది. ఇదంతా తాజాగా బాలీవుడ్ లో విడుదలైన సర్కస్ అనే కళాఖండం గురించి. రణ్వీర్ సింగ్ హీరో కాగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ల ఒకరు.

దర్శకుడు రోహిత్ శెట్టి ఇటీవలే సౌత్ ఇండస్ట్రీ మీద ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేసి సోషల్ మీడియాలో తలంటించుకున్న సంగతి తెలిసిందే. సరే ఇతగాడు సర్కస్ ని ఎంతమాత్రం గొప్పగా తీశాడో చూద్దామని నెటిజెన్లు ఎదురుచూశారు. దానికి తగ్గట్టే తీసికట్టు కంటెంట్ తో చవకబారు కామెడీతో జనాలు థియేటర్ల నుంచి ఎప్పుడెప్పుడు పారిపోదామా అన్నంత గొప్పగా అందించాడు. కథ పాత చింతకాయ పచ్చడే. షేక్స్ పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో మొదలుపెట్టి ఇదే రోహిత్ పదహారేళ్ళ క్రితం తీసిన గోల్ మాల్ దాకా అన్నీ మిక్సీలో వేసి ఖంగాళీ చేసి పారేశాడు. ట్రైన్ కింద రూపాయి బిళ్ళ పెడితే నలిగిపోయినట్టు ఎప్పుడో ఎక్స్ ఫైర్ అయిన పాయింట్ తో సర్కస్ తీశాడు.

ADVERTISEMENT

రెండు జంటల కవలలు వేర్వేరు చోట్ల పెరిగితే ఎలా ఉంటుందన్న బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న రోహిత్ శెట్టి కనీసం కపిల్ శర్మ షో టైపు హాస్యాన్ని కూడా జొప్పించలేకపోయాడు. పద్మావత్ లాంటి పీరియాడిక్ డ్రామాలో అద్భుతంగా నటించిన రణ్వీర్ సింగ్ రాను రాను ఓవరాక్షన్ కు పరాకాష్టగా మారుతున్నాడు. టెంపర్ హిందీ రీమేక్ సింబ కనక మీరు చూసుంటే ఈ మాట ఒప్పుకుంటారు. ఎందుకంటే రూపాయికి పది రూపాయల పెర్ఫార్మన్స్ తో వామ్మో జూనియర్ ఎన్టీఆర్ చేసింది ఈ పాత్రేనా అని అనుమానం వచ్చేలా ఖూనీ చేశాడు. సరే సబ్జెక్టులో దమ్ము వల్ల కమర్షియల్ హిట్ అయ్యింది. దీన్ని తీసింది ఈ రోహిత్ శెట్టే అన్న విషయం మర్చిపోకూడదు.

ఇలాంటి డబుల్ ట్విన్ సినిమాలు చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. ఏదో గొప్ప ఫిలిం మేకర్ లా నీతులు చెప్పే రోహిత్ ఎప్పుడో 92లో వచ్చిన ఆంఖే నుంచే ఈ పాయింట్ ఎత్తుకున్నాడు. వెంకటేష్ పోకిరి రాజాగా వచ్చింది దీని రీమేకే. రోహిత్ మీద వ్యక్తిగత ద్వేషంతో కొందరు పనిగట్టుకుని సర్కస్ ని నెగటివ్ చేస్తున్నారనే కామెంట్స్ ట్విట్టర్ లో కనిపిస్తున్నాయి. వీరికి జ్ఞానోదయం కలగాలంటే సర్కస్ ఫ్రీ షో వేయడం తప్ప వేరే మార్గం లేదని అప్పుడే కౌంటర్లు కూడా వస్తున్నాయి. ఏదో మొన్న దృశ్యం 2 భారీ హిట్ అయ్యిందన్న ఆనందం బాలీవుడ్ కు కలిగే లోపే ఇప్పుడీ సర్కస్ ఫీట్ల సత్తెకాలపు కామెడీ రూపంలో డిజాస్టర్ రావడం ఏడాది చివరిలో కొసమెరుపు.

ADVERTISEMENT
Latest Stories