అనిర్వచనీయమైన విజయాన్ని సాధించిన “ఆర్ఆర్ఆర్” మరో అద్వితీయమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు 1000 కోట్లు కలెక్షన్స్ అందుకుని, ఇండియన్ టాప్ 3 స్థానంలో నిలబడింది. అనేక వాయిదాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు బాలీవుడ్ ఆదరణ ఎంతవరకు ఉంటుందనేది కాస్త ప్రశ్నార్థకంగానే ఉంది.
కానీ రిలీజ్ అయిన రెండవ రోజు నుండే ఈ అంచనాలను తలక్రిందులు చేస్తూ, మొదటి రోజుకు మించిన కలెక్షన్స్ ను ఆ తదుపరి రోజులలో సాధించింది. ఇలా ఇప్పటివరకు బాలీవుడ్ లో 220 కోట్ల పైబడి అందుకుంది. ఈ వీకెండ్ ముగిసే సమయానికి 230 కోట్లు పైనే కొల్లగొడుతుందని అంచనా. ‘కేజీఎఫ్’ రిలీజ్ నాటికి బాలీవుడ్ లోనే 250 కోట్ల మార్క్ ను అందుకోనుంది.
తెలుగునాట అయితే ఇప్పటికే ఈ ఫిగర్ ను దాటి మ్యాజిక్ సృష్టిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా 100 కోట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది మన ‘ఆర్ఆర్ఆర్.’ చిత్ర యూనిట్ నుండి అధికారికంగా విడుదలైన ఈ 1000 కోట్ల పోస్టర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ఇచ్చిందని చెప్పడంలో సందేహంలేదు.
ఇండియన్ సినీ విభాగంలో అమీర్ ఖాన్ “దంగల్” తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాత మన “బాహుబలి” పార్ట్ 2 నిలిచింది. ఈ 1000 కోట్ల కలెక్షన్స్ తో మూడవ స్థానంలో “ఆర్ఆర్ఆర్” చేరింది. టాప్ 3లో రెండు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలే కాగా, ఈ సినిమాతో తారక్ అండ్ చరణ్ లు 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లయ్యింది.



