తెలంగాణ నేపథ్యంలో ఈమధ్య సినిమాలు ఎక్కువగా వస్తున్న ట్రెండ్ లో ఒకప్పటి దొరల దాష్టికాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో తీసిన చిత్రం రుద్రంగి. ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేని ఈ పీరియాడిక్ డ్రామాలో జగపతిబాబు ఫేస్ మీదే పబ్లిసిటీ ప్లస్ బిజినెస్ రెండూ చేసేశారు. పోస్టర్లు, ట్రైలర్ వగైరా చూస్తే ఇదేదో కొంత ఆసక్తి రేపేలా ఉందని ఫీలైన ఆడియన్స్ లేకపోలేదు.
ముందు కథేంటో చూద్దాం. స్వాతంత్రం వచ్చిన 1947 కొత్తలో రుద్రంగి అనే చిన్న తండా భీంరావ్ దేశముఖ్(జగపతిబాబు)ఆధీనంలో ఉంటుంది. భార్య గర్భవతిగా ఉండగానే జ్వాల(మమతా మోహన్ దాస్)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. దొర దగ్గర నమ్మిన బంటుగా పెరిగి పెద్దవుతాడు మల్లేష్(ఆశిష్ గాంధీ). అతని మరదలు రుద్రంగి(గనవి లక్ష్మణ్)మీద దొర కన్ను పడుతుంది. ఆ తర్వాత జరిగేదే స్టోరీ.
అణిచివేయబడిన పీడిత వర్గాల ఘోషను, దొరల దుర్మార్గాలను ఒక ప్రేమకథకు ముడిపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు అజయ్ సామ్రాట్. చాలా ఏళ్ళ క్రితం రచయిత విజయేంద్రప్రసాద్ తీసిన నాగార్జున రాజన్న ఈ బాపతే. అయితే దానికి ఉన్న స్టార్ పవర్ రుద్రంగిలో లేకపోవడంతో భారం మొత్తం జగపతిబాబు మీదే పడింది. హీరోగా కనిపించాల్సిన మల్లేష్ సదరు నటుడి లోపం వల్ల తేలిపోయింది.
నిజానికి దొర చేసే దారుణాలను చాలా తీవ్రంగా ఊహించుకుంటాం. కానీ భీంరావ్ ని కేవలం కామంతో రగిలిపోయే దుష్టుడిగా చూపడంతో వేరే ఉపకథలకు ఆస్కారం లేక సింగల్ లైన్ మీద నడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ ట్విస్టులు ఒక వర్గం వరకు పర్వాలేదనిపించుకున్నా రెండో సగం నేరేషన్లో దొర గూడెం జనాలను హింసించడానికి తప్ప ఇంకేం లేకపోవడంతో కథనం ఒక్కసారిగా గాడి తప్పింది.
ఉద్వేగానికి గురి చేసే ఎపిసోడ్స్ రాసుకోవడానికి చాలా అవకాశమున్నా అజయ్ సామ్రాట్ దాన్ని వాడుకోలేదు. పైగా పది నిమిషాలకోసారి చుట్టూ ఉన్న పాత్రలను మ్యూట్ చేసిన బండబూతులు తిట్టడం తప్ప భీంరావ్ చేసే పనేం లేకపోవడంతో ఎమోషన్ మొత్తం మల్లేష్, రుద్రంగిల చుట్టే పదే పదే తిరుగుతూ విసుగుకు కారణమయ్యింది. భావోద్వేగాలు పండించే ఛాన్స్ ఎంత మాత్రం లేకపోయింది.
జగపతిబాబు, చాలా కాలం తర్వాత కనిపించిన మమతా మోహన్ దాస్ ఇద్దరు మాత్రమే పెర్ఫార్మన్స్ పరంగా గుర్తుంటారు. కీలకమైన మల్లేష్ పాత్రలో ఆశిష్ గాంధీ ఎలాంటి ఎక్స్ ప్రెషన్లు లేని బ్లాంక్ ఫేస్ పెట్టడంతో అంత గుబురు గెడ్డంలోనూ దొరికిపోయాడు. విమల రామన్, హీరోయిన్ గనవి లక్ష్మణ్ లతో సహా చాలా మటుకు అందరూ డల్లుగా కనిపించారు. నోఫెల్ రాజా సంగీతం ఒకటే కొంత ఊరట.
ఓ పిచ్చి అమ్మాయి దొరని పెళ్లి చేసుకోమని సతాయిస్తుంది. తీరా ఇంటర్వల్ అయ్యాక మహా తెలివిగా ప్రవర్తిస్తూ హీరోకు సలహాలు ఇస్తుంది. ఇలాంటి క్యారెక్టరైజేషన్ లోపాలు బోలెడు. ఎంత తెలంగాణ బ్యాక్ డ్రాప్ అయినా మరీ ఇంత తేలికైన స్క్రీన్ ప్లేతో పాత కథలను తెరకెక్కిస్తే అందరినీ మెప్పించడం కష్టం. థియేటర్ నుంచి బయటికి వచ్చాక దొర అరుపులు తప్ప దర్శకుడు ఏం చెప్పాడో గుర్తురావడం కష్టమే



