హుజూర్ నగర్ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. వెంటనే తెలంగాణ రాస్ట్ర సమితి కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన సైదిరెడ్డినే తిరిగి అభ్యర్ధి గా పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు.
గత ఎన్నికలలో ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో సుమారు ఏడువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి గణనీయమైన ఓట్లు రావడంతోనే స్వల్ప తేడాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టెక్కారని ఈ సారి ఆ గుర్తు తొలగించడంతో తమ గెలుపు ఖాయమని అధికార పక్షం వాదన.
ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే ఆయన తన భార్య పద్మావతి పేరును అభ్యర్దిగా ప్రకటించి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం కాంగ్రెస్ లో వివాదంగా మారింది. దీనితో కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరోవైపు బీజేపీ తన అభ్యర్థిని పోటీలో పెట్టాల్సి ఉంది. తెలుగుదేశం, ఇతర పార్టీలు పోటీలో ఉంటాయో లేదో చూడాలి. అందరికంటే ముందే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి తెరాస ముందంజేలో ఉంది. అక్టోబర్ 21 న పోలింగ్, 24న కౌంటింగ్ జరుగుతుంది. తెరాస ఈ సీటు గెలుచుకుంటే తెలంగాణపై తన పట్టు నిలబెట్టుకున్నట్టే.





