కష్టం అంటే ఏంటో తెలిసిన మనిషి ఆపదలో ఎలా స్పందిస్తాడో…. అన్న దానికి నిదర్శనమే ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు స్పందన..! ఏపీలో శ్రీకాకుళం జిల్లాను కుదిపేసిన తిత్లీ తుఫాన్ కు స్పందించిన సంపూ, తన వంతు సాయంగా 50 వేల రూపాయలను ప్రకటించాడు. అలాగే మన వంతు సాయంగా ఎవరికీ వారు తగిన విధంగా చర్యలు చేపట్టాలని విన్నవించుకున్నారు.
[m9ad]
తెలంగాణాలో ఓ మారుమూల పల్లె నుండి వచ్చిన సంపూ, ఏపీపై స్పందించడం ఇదే తొలిసారి కాదు. గతంలో స్పెషల్ స్టేటస్ ఉద్యమం సమయంలో విశాఖ చేరుకొని సంపూ తెలిపిన మద్దతు ఎవరూ మరిచి ఉండరు. ఏపీకి చెందిన అగ్ర స్టార్ హీరోలు ఇంకా స్పందించలేదు గానీ, ‘స్టార్’ హోదాలో చిన్నోడైనా, మనసు విషయంలో అందరికంటే కాస్త ‘పెద్దవాడిననే’ విషయాన్ని నిరూపించుకుంటున్నాడు.
దీంతో సంపూ చేసిన సాయంపై నెటిజన్లు కూడా ఎంతో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చేసిన సాయం చిన్నదా, పెద్దదా అన్న అంశం కంటే, మంచి మనసుతో ముందుకు వచ్చి తన వంతు మద్దతు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. సినిమాలలో అయితే ‘ప్లాస్టిక్ హృదయాన్ని’ సృష్టిస్తాడు కానీ నిజ జీవితంలో కాదని చెప్తోన్న సంపూకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుదాం.



