ట్రెండింగ్‌లో సనాతన ధర్మం…

Sanatana Dharma trending amid film debates and public controversy

సనాతన ధర్మం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందంటే దానిని కాపాడుకొస్తున్న వారికి మళ్ళీ కోపం రావచ్చు. కానీ జనాలకు అర్ధం కావాలంటే, ఆసక్తి చూపాలంటే రామాయణ, మహాభారతాలతో తీసే సినిమాలలో సైతం గ్రాఫిక్స్ తప్పనట్లే ఈ పదం కూడా అని క్షమించేయవచ్చు.

హిందూమతంలో సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. కానీ డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టాకనే అందరూ గూగుల్ చేస్తున్నారు. సనాతన ధర్మం ట్రెండింగ్‌లో ఉంది కనుక మన సినిమావాళ్ళు కూడా ఆ ధర్మాన్ని సొమ్ము చేసుకుంటూనే తెచ్చి పంచాయితీలు పెడుతున్నారు.

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌ తర్వాత మళ్ళీ రాజమౌళి వల్లనే సనాతన ధర్మం ట్రెండింగ్‌లోకి వచ్చిందని చెప్పక తప్పదు. ఆయన హనుమంతుడు-భక్తి అంటూ ఏవో నాలుగు ముక్కలు మాట్లాడగానే (పవన్‌ కళ్యాణ్‌ తప్ప) ‘సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నవారందరూ దానికి ప్రమాదం కలిగిస్తున్నందుకు రాజమౌళిని తిట్టిపోస్తున్నారు.

అయితే ఎవరూ కూడా సనాతన ధర్మం అంటే ఏమిటో అజ్ఞానులైన ప్రజలకు వివరించడం లేదు. కనుక దానికి ఏదో కీడు జరిగే ఉంటుందని, వారి విమర్శలు, వ్యాఖ్యలను తెగ చదివేస్తుండటంతో ‘సనాతన ధర్మం’ ఇంకా వైరల్ అవుతోంది.

పోనీ అలాగైనా ‘సనాతన ధర్మం’ నలుగురి నోళ్ళలో నాని కాపాడబడుతుందని కొందరు సంతోషిస్తుంటే, సనాతన ధర్మం ద్వారా కూడా తమకు ఇన్ని లైక్స్ వస్తున్నందుకు మరికొందరు సంతోషిస్తున్నారు.

ఇప్పుడు సనాతన ధర్మం ట్రెండింగ్‌లో ఉంది కనుక సినిమా వాళ్ళు కూడా దానితో ముడిపెట్టి కధ అల్లేసి హీరోల చేత ‘సనాతన ధర్మంతో పెట్టుకోకూ… పెట్టుకుంటే మటాష్ అయిపోతావు…” అంటూ పంచ్ డైలాగులు పలికిస్తున్నారు.

అలాగే సనాతన ధర్మం అంటే దెయ్యాలు, భూతాలు, ఆత్మలను పారద్రోలే శక్తి అనుకునే దర్శకులు కూడా ఉన్నారు. మొదట ఆ శక్తిని నమ్మని హీరోలు సినిమా ముగిసేసరికి ఆ శక్తి ఉందని అంగీకరించి, వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత భుజంపై వేసుకుంటున్నారు.

కనుక సినిమా వాళ్ళు సనాతన ధర్మానికి కూడా విలన్లను సృష్టించి, వారితో ధర్మానికి అంటే దాని ప్రతినిధి అయిన హీరోకి కొన్ని గ్రాఫిక్ ఫైట్స్ పెట్టి, విలన్లను చిత్తుచిత్తు చేసేసి వారు కూడా సనాతన ధర్మాన్ని ఉడతా భక్తిగా కాపాడేస్తున్నారు.

వారిలో ఒకరైన రాజమౌళి నాకు దానిపై నమ్మకం లేదంటూనే రాముడు, కృష్ణుడు, శివుడు, వారణాశి అంటూ సినిమాలు తీసేస్తున్నారు.

రాజమౌళి నోరుజారి విమర్శలు ఎదుర్కొటుంటే, సాటి దర్శకుడుని కాపాడే బాధ్యతని రాంగోపాల్ వర్మ తీసుకొని ఆయన కూడా హిందూ మతం, దేవుళ్ళు, సనాతన ధర్మం గురించి చాలా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేశారు. కనుక మళ్ళీ అయనతో మరికొంత మంది పేరలల్ ఫైట్స్ మొదలుపెట్టారు. అలా అయన కూడా మళ్ళీ ట్రెండింగ్‌లోకి రాగలిగారు.

సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చాలా మందే ఉన్నారని ఇప్పుడు స్పష్టమైంది. కనుక దానికి ఎటువంటి ప్రమాదం లేదనే భావించవచ్చు.

కానీ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు ‘సనాతన ధర్మం అంటే ఏమిటి?’ అని అడగొద్దు. ఆలోచింఛి బుర్రలు పాడుచేసుకోచొద్దు!

ADVERTISEMENT
Latest Stories