ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులను తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎయిర్ హెస్టెస్, మోడల్, స్మగ్లర్ 26 ఏళ్ళ సంగీత చటర్జీని చిత్తూరు పోలీసులు మంగళవారం కోల్ కతాలో అరెస్ట్ చేశారు. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ కు దగ్గరైన ఆమె, అక్రమ రవాణాలోకి అడుగుపెట్టి కోట్లకు పడగలెత్తింది. అంతేకాదు హవాలా ద్వారా భారీ నగదు లావాదేవీలకు పాల్పడింది.
గతేడాది కోల్ కతాలోని ఆమె నివాసంలో దాడులు చేసిన చిత్తూరు పోలీసులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్ల నుంచి నకిలీ తుపాకీ లైసెన్స్ లను స్వాధీనం చేసుకున్నారు. సంగీత అరెస్ట్ కోసం పలుమార్లు ప్రయత్నించినా ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాధ్యం కాలేదు. కాగా 15 రోజుల క్రితం చిత్తూరు నుంచి కోల్ కతా వెళ్లిన పోలీసుల బృందం రెక్కీ నిర్వహించి సంగీతను అరెస్ట్ చేసి చిత్తూరు తీసుకొచ్చారు.



