దర్శకుడు రవి శ్రీవాస్తవ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపించి కలకలం రేపిన ‘బుజ్జిగాడు’ బ్యూటీ సంజన క్షమాపణలు చెప్పింది. అందరిలాగే ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన తాను తన మొదటి చిత్రం ‘గండ-హెండతి’ చిత్రీకరణ సమయంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆరోపించిన విషయం తెలిసిందే.
[m9ad]
శాండల్‌వుడ్‌లో తనకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, ముద్దు సీన్లతో పాటు తన శరీరాన్ని అసభ్యంగా చిత్రీకరించారని, ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టి అసభ్యంగా షూట్ చేసారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు తాను వ్యతిరేకిస్తే ఇండస్ట్రీలో భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించారని, తాను చిన్న పిల్లని కావడంతో తన అవసరాన్ని వారు వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేసింది.
అయితే సంజన ఆరోపణలను దర్శకుల సంఘం ఖండిస్తూ, అసత్య ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. సంజన బేషరతుగా క్షమాపణలు చెప్పే వరకు కన్నడ సినిమాల్లో ఆమెకు అవకాశం కల్పించబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో దిగివచ్చిన సంజన దర్శకుడు శ్రీవాత్సవ, దర్శకుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్, సంఘం పథాధికారులకు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ‘మీటూ’ ఆరోపణలపై ఇలా వెనక్కి తగ్గడం ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది.



