ఓ ఉప్పెనో, సునామీనో వచ్చి మీద పడిపోతున్నట్లు… పెద్ద సినిమాలన్నీ ఒక్కసారిగా తమ రిలీజ్ డేట్లను ప్రకటించాయి, ఒక్క ప్రభాస్ “రాధే శ్యామ్” తప్ప! బహుశా అది కూడా వస్తే ఈ రాత్రి సంపూర్ణం అయినట్లే! అన్నింటి కంటే పెద్ద ట్విస్ట్ మహేష్ బాబు “సర్కార్ వారి పాట” రిలీజ్ డేట్.
ఈ సినిమాను అస్సలు ప్రమోట్ చేయడం లేదని మైత్రీ మూవీ మేకర్స్ పై మహేష్ అభిమానులు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఫిబ్రవరి 14వ తేదీన ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక ఇప్పట్లో మళ్ళీ ఈ సినిమా ఊసెత్తరులే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
దీనికి మరో ప్రధాన కారణం… జనవరి తొలి వారంలో జరిగిన మహేష్ సోదరుడు రమేష్ అకాల మరణం. దీని నుండి ఇంకా కోలుకొని సూపర్ స్టార్ ఇప్పటివరకు ‘సర్కార్’ వారి సెట్స్ వైపుకు చూడలేదు. మహేష్ లేకుండా కొంత పార్ట్ చిత్రీకరణ జరిగినప్పటికీ, ఏప్రిల్ 1 రిలీజ్ మాట అటుంచితే కాదు, ఆగష్టు నాటికి సిద్ధమవుతుందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినపడింది.
కానీ అందరికి ట్విస్ట్ ఇస్తూ మే 12వ తేదీన “సర్కార్ వారి పాట” సినిమాను రిలీజ్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించడం అభిమానులకైతే ఆశ్చర్యానికి గురి చేసింది. అన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఫైనల్ అయిన నేపధ్యంలో, అన్నింటిని ఒకేసారి ప్రకటించి అందరి హీరోల ఫ్యాన్స్ ను ఖుషీ చేసినట్లయింది.
మహేష్ ఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ కు మించిన ఆనందం ఏమిటంటే, సోదరుడు విషాదం నుండి బయటపడి సెట్స్ పైకి సూపర్ స్టార్ అడుగు పెడుతున్నారన్న వార్త. అలాగే ఫిబ్రవరి 3వ తేదీన త్రివిక్రమ్ సినిమా కూడా ప్రారంభోత్సవం జరుపుకోనుండగా, మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ లో కూడా మహేష్ పాల్గొనబోతుండడం.



