“గీత గోవిందం” సినిమాతో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ తో… టైర్ 2లో ఉన్న హీరోల రేంజ్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ సినిమాకు లభించిన కలెక్షన్స్ తో ఈ విభాగంలో ఉన్న ఇతర హీరోలపై ఎక్కువ ప్రభావం పడింది. అందులో భాగంగానే “శైలజారెడ్డి అల్లుడు” రూపంలో వచ్చిన చైతూపై ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఒత్తిడి ఏర్పడింది.
[m9ad]
బహుశా అన్నీ అనుకున్నట్లుగా జరిగి, సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ప్రస్తుతం మాత్రం డివైడ్ టాక్ తో ధియేటర్లలో నడుస్తోంది. మార్కెట్ లో సినిమాలు కూడా పెద్దగా లేకపోవడం… వినాయకచవితి పండగ వాతావరణ ప్రభావంతో… టాక్ ఎలా ఉన్నా, తొలి మూడు రోజులకు 23 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ పండితులు ధృవీకరించారు.
నాలుగవ రోజు (నేడు) ఆదివారం కనుక, మహాఅయితే 23కు ఓ మూడు, నాలుగు కలుపుకున్నా, 30 దరిదాపుల్లోకి ‘అల్లుడు’ వచ్చి చేరుతారు. చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పడంలో సందేహం లేదు. కానీ తొలి నాలుగు రోజుల్లో విజయ్ ‘గీత గోవిందం’ సినిమా ఎంత కొల్లగొట్టింది? అంటే ఈ రెండు సినిమాలకు దాదాపుగా 10 కోట్లపైనే వ్యత్యాసం ఉంది.
‘గీత గోవిందం’ మాదిరిగానే ఒకవేళ ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ లభిస్తే, ఆ 10 కోట్ల వ్యత్యాసం సమసిపోతుందా? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ దేవరకొండ ప్రభావంతో ‘గీత గోవిందం’ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ లభించింది, ఆ అంచనాలను సినిమా అందుకుంది. కానీ ‘శైలజారెడ్డి అల్లుడు’ విషయంలో ఈ రెండూ లోపించాయి, ఆ ప్రభావమే ఇప్పుడు కనపడుతోంది.



