పులి మీద సవారీ చేయాలనుందా? అయితే షేర్ మార్కెట్ ఉందిగా!

share-market-loss-hyderabad-software-engineer-suicide

ఒకప్పుడు షేర్ మార్కెట్ అంటే ఆ రంగంలో నిపుణులు లేదా దాని గురించి మంచి అవగాహన కలిగి, పెట్టుబడులు పెట్టగల ఆర్ధిక స్తోమతు ఉన్నవారికే పరిమితంగా ఉండేది. కానీ దాని గురించి కూడా పూర్తి సమాచారం అందరికీ అందుబాటులోకి రావడం, ఐటి ఉద్యోగాలు, ఇతర ఆదాయ మార్గాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు కూడా షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు.

షేర్ మార్కెట్లో ఒక సూక్తి ఉంది. చేతి నిండా డబ్బుతో వస్తే మంచి అనుభవంతో తిరిగి వెళ్తారు. మంచి అనుభవంతో వస్తే చేతి నిండా డబ్బుతో తిరిగి వెళ్తారు.

ADVERTISEMENT

అయితే చాలా మంది షేర్ మార్కెట్ గురించి కొన్ని ప్రాధమిక విషయాలు తెలుసుకోగానే షేర్ మార్కెట్ గురించి తమకు పూర్తి అవగాహన ఏర్పడిందనే భ్రమలో పెట్టుబడులు పెట్టి నష్టపోతుంటారు.

షేర్ మార్కెట్లోకి ప్రవేశించడం అంటే పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే అని చాలా మంది అంటారు. నిజమే కానీ దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం కూడా అవసరమే. తెలుసుకోలేని అభిమాన్యులు చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో సుజిత్ పండిట్ కుమార్‌ కూడా ఒకరు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న అతను గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని తాను నివాసం ఉంటున్న భవనంలో 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం షేర్ మార్కెట్లో సుమారు రూ. 25 లక్షలు కోల్పోవడమే.

షేర్ మార్కెట్లో సులువుగా డబ్బు సంపాదించవచ్చనే చెప్పుడు మాటల వలనో లేదా మరో కారణం చేతో ‘లోన్ యాప్’ కంపెనీల నుంచి అప్పులు తీసుకొని మరీ షేర్ మార్కెట్లో పెట్టడంతో నష్టపోయాడు. వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని ప్రాణం కూడా కోల్పోయాడు.

కనుక షేర్ మార్కెట్లో ప్రవేశించాలనుకునే వారు ముందుగా తమ ఆర్ధిక పరిమితులను, నష్టం భరించగల శక్తిని సరిగ్గా అంచనా వేసుకొని దిగి, ఆచితూచి పెట్టుబడులు పెడితే, లాభాలు రావచ్చు. ఒకవేళ ఎదురుదెబ్బలు తగిలినా త్వరగా తక్కువ నష్టంతో బయటపడవచ్చు. కానీ మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి పద్మవ్యూహంలో ప్రవేశించడం దేనికి?పెట్టిన డబ్బు, మనశాంతి, ప్రాణాలు పోగొట్టుకోవడం దేనికి?

ADVERTISEMENT
Latest Stories