అమరావతి పై ‘ది ప్రింట్’ గుప్తా ప్రశంసలు…

Shekhar Gupta Praises Chandrababu Naidu's Amaravati Vision

రాజకీయాల్లో ఎన్నికలు, అధికార మార్పులు సర్వసహజం. కానీ ఒక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే తరాలకు ఉపయోగపడే నగరాన్ని నిర్మించాలనే ఆలోచన మాత్రం అరుదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అలాంటి చర్చకే కేంద్రంగా మారింది.

ప్రముఖ జర్నలిస్ట్, ‘ది ప్రింట్’ ఎడిటర్ శేఖర్ గుప్తా అమరావతిని సందర్శించిన అనంతరం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమరావతిని చూసి దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు కూడా నేర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రాల్లో కొత్తగా నగరాలను నిర్మించాలనుకునే ముఖ్యమంత్రులకు ఏపీ రాజధాని అమరావతి ఒక బ్రాండ్ కానుంది అంటూ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

సుమారు 53 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రణాళికాబద్ధమైన రాజధానిని నిర్మించాలన్న చంద్రబాబు ఆలోచనను శేఖర్ గుప్తా ప్రశంసించారు. అమరావతి అంటే కేవలం ప్రభుత్వ భవనాలు, రహదారులు మాత్రమే కాదని, ఐటీ, విద్య, వైద్యం, వాణిజ్యం వంటి రంగాలు అభివృద్ధి చెందేలా ఒక కొత్త నగరాన్ని నిర్మించాలన్నది దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమన్నారు గుప్తా.

అయితే అమరావతి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2014లో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నాటి సీఎం చంద్రబాబుకు 2019లో ప్రభుత్వం మారడంతో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది. జగన్ ఒంటెద్దుపోకడలతో ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణాలు నిలిచిపోయాయి.

2024 లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తిరిగి అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టారు. అయితే అమరావతిలో మరో ప్రత్యేకత ల్యాండ్ పూలింగ్ విధానం. రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించకుండా, వారిని రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా మార్చే ప్రయత్నం చేశారు.

భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, వార్షిక కౌలు అందించే విధానాన్ని తీసుకొచ్చారు. దాదాపు 33 వేల ఎకరాలను ఈ విధంగా సమీకరించడం రాజధాని నిర్మాణంలో కీలకమైన అంశంగా మారింది, అలాగే దేశ రాజకీయ చరిత్రలో అమరావతి భూసమీకరణ ఒక నూతన చరిత్రను సృష్టించింది.

అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా, ఐటీ, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు లక్ష్యం. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి గతంలో చంద్రబాబు వేసిన పునాదుల తరహాలో అమరావతిని కూడా అభివృద్ధి చేయాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే అమరావతికి ప్రశంసలు రావడం మాత్రమే సరిపోదు. రాజధాని నిర్మాణం వేగంగా జరగాలి.

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పెట్టుబడులు రావాలి. ప్రజలకు అవసరమైన రవాణా, విద్య, వైద్యం వంటి సదుపాయాలు అందుబాటులోకి రావాలి. అప్పుడే అమరావతి ఒక పూర్తిస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుంది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా కొనసాగించాలి. హైదరాబాద్ అభివృద్ధిలో కనిపించిన ఈ కొనసాగింపు అమరావతికి కూడా అవసరం. లేకపోతే రాజకీయ విభేదాల మధ్య రాష్ట్ర అభివృద్ధి వెనుకబడే ప్రమాదం ఉంది.

శేఖర్ గుప్తా వ్యాఖ్యలు చంద్రబాబుకు లభించిన ప్రశంసగా మాత్రమే కాకుండా, అమరావతికి ఉన్న అవకాశాలను గుర్తుచేసే మాటలుగా చూడాలి. చంద్రబాబు కలలుగన్న అమరావతి నిజంగా ప్రపంచస్థాయి నగరంగా ఎదిగితే అది ఒక నాయకుడి విజయం మాత్రమే కాదు, ఆయన విజనరికి గుర్తింపే కాదు.. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గర్వకారణం అవుతుంది!

అయితే ఇలా రచ్చ గెలుస్తున్న అమరావతి వైసీపీ ఇంట రాజకీయాలతో నలిగిపోతుంది, వరద ప్రాంతంగా నిందలు మోస్తుంది. ఇప్పటికైనా వైసీపీ అమరావతి పై విష ప్రచారానికి ముగింపు పలికి, మావిగన్ వంటి కొత్త ప్రతిపాదనలకు నీళ్లొదిలి, అమరావతి నిర్మాణంలో ఒక ఇటుక మాదిరి చేయూతనిస్తే నాటి ‘రామసేతు’ నిర్మాణంలో ‘ఉడుత’ మాదిరి వైసీపీకి గుర్తింపు, గౌరవం లభించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories