వెండితెరపై ఎంత ‘బోల్డ్’గా అందాలు ఆరబోసినా, బయట మాత్రం అంత ‘బోల్డ్’గా నిజాలను ఒప్పుకోరు. అయితే దానికి తానూ విరుద్ధం అంటోంది హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. ‘గుంటూర్ టాకీస్’ చిత్రం ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ముద్దుగుమ్మ, ఈ చిత్రంలో తానూ చాలా ‘బోల్డ్’గా నటించానని, సినిమా పూర్తయిన తర్వాత, అసలు శ్రద్దా ఎలా చేసిందా అనే అభిప్రాయం కూడా వ్యక్తం కావచ్చని చిత్ర విశేషాలను చెప్పుకొచ్చింది.
అయితే, ఆడ, మగ అన్న తారతమ్యం లేకుండా ఏ సినీ సెలబ్రిటీనైనా ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టులు అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది. ‘ఈ సినిమా తర్వాత మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ లు ఏంటి? అని..! ఈ ప్రశ్న ఎంత రొటీన్ గా వేస్తారో… అంతే రొటీన్ గా సమాధానం కూడా ఉంటుంది. ‘ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి, త్వరలోనే అన్ని విషయాలు చెప్తాం’ అంటూ సినీ సెలబ్రిటీలు ఇచ్చే జవాబులకు కొదవ లేదు.
అయితే ఈ ప్రశ్నకు శ్రద్దా దాస్ మాత్రం కాస్త డిఫరెంట్ గా సమాధానం ఇచ్చింది. ‘ప్రస్తుతానికి ఏ సినిమాలు లేవు’ అంటూ మొహమాటానికి తావు లేకుండా, దాపరికానికి ఆస్కారం లేకుండా కుండ బద్దలు కొట్టింది. ముఖ్యంగా హీరోయిన్ల నుండి ఇలాంటి జవాబులు ఆశించేవి కావు. అవకాశాలు ఉన్నా, లేకున్నా కాస్త ‘డాంబికం’ ప్రదర్శిస్తూ ఉంటారు. వెండితెరపై ఎంత ‘బోల్డ్’గా నటించిందో మరికొద్ది గంటల్లో తెలియనుంది గానీ, తెరవెనుక మాత్రం శ్రద్దా ‘బోల్డ్’తనానికి కొదవలేదు అంటున్నారు సినీ వర్గీయులు.





